అక్షర్‌ ధాం లో బ్రిటన్ ప్రధాని... సతీసమేతంగా ప్రత్యేక పూజలు!

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈరోజు ఉదయం అక్షర్‌ ధాం ఆలయాన్ని సందర్శించారు.

Update: 2023-09-10 07:44 GMT

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈరోజు ఉదయం అక్షర్‌ ధాం ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఈ ప్రత్యేక ఆలయాన్ని సందర్శించిన ఆయన... అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు గంటన్నర పాటు.. ఆలయంలో గడిపారు.

అవును... ముందుగా చెప్పినట్లుగానే బ్రిటన్ ప్రధాని, ఇండియా అల్లుడు రిషి సునాక్.. సతీసమేతంగా అక్షర్ ధాం ఆలయాన్ని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో హస్తిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం మహాత్మా గాంధీ స్మారకం రాజ్‌ ఘాట్‌ కు చేరుకున్నారు సునాక్‌.

సునాక్, మహాత్మ గాంధీ స్మారక రాజ్ ఘాట్ కు చేరుకున్న సమయంలో ఆయనకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఇదే సమయంలో జీ20 సదస్సు నిమిత్తం భారత్‌ కు చేరుకున్న దేశాధినేతలందరితో కలిసి రిషి సునాక్‌, మహాత్మ గాంధీకి నివాళులర్పించనున్నారు.

మరోపక్క జీ20 సదస్సుకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌.. ఈ నెల 9వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంలో మిగిలి ఉన్న విషయాలపై త్వరలో చర్చించి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పంద ద్వారా ఆర్థిక, రక్షణ, సాంకేతిక తదితర రంగాల్లో పరస్పర సహకారం ఉండనుందని తెలుస్తుంది.

కాగా తాను హిందువుగా గర్విస్తున్నానని, తన మూలాలు అవేనంటూ రిషి సునాక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉన్న ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శిస్తాననీ కూడా ఆయన చెప్పారు. ఇదే సమయంలో జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున కృష్ణాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయానని, అందుకే ఇక్కడ ఒక ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే, ముందుగా చెప్పినట్లుగానే ఢిల్లీలోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షర్‌ ధాం ఆలయాన్ని సందర్శించారు. ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని పాండవ్ నగర్‌ లో, గ్రేటర్ నొయిడా సరిహద్దులకు సమీపంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని బ్రిటన్ ప్రధాని సతీసమేతంగా దర్శించుకున్నారు.

Tags:    

Similar News