మోడీకి భారీ షాక్ ఇచ్చిన ఆరెస్సెస్ ?

దాని ఫలితంగా 1925లో ఆరెస్సెస్ ఏర్పాటు అయితే ఆ తరువాత పాతికేళ్ల తరువాత బీజేపీ ఆవిర్భావం జరిగింది.

Update: 2024-06-11 16:30 GMT

బీజేపీకి పునాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆరెస్సెస్ నుంచి వచ్చిన ఆనేక అంగాలలలో రాజకీయ అంగమే బీజేపీ. దేశంలో తమదైన భావజాలంతో ఒక రాజకీయ పార్టీ ఉండాలని అధికారం అందుకోవాలని ఆరెస్సెస్ భావించింది. దాని ఫలితంగా 1925లో ఆరెస్సెస్ ఏర్పాటు అయితే ఆ తరువాత పాతికేళ్ల తరువాత బీజేపీ ఆవిర్భావం జరిగింది.

నెహ్రూ మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జనసంఘ్ ని స్థాపించారు. వ్యవహారికంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీని 1951 అక్టోబర్ 21న ఢిల్లీలో స్థాపించారు. జనసంఘ్ నుంచే అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పాత్ర వహించారు.

అయితే 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా ప్రభుత్వం 1979లో కుప్ప కూలడంతో భారతీయ జనతా పార్టీని వాజ్ పేయి స్థాపించారు. ఇదంతా ఎందుకు అంటే నాటి జనసంఘ్ కానీ తరువాత వచ్చిన బీజేపీ కానీ ఆరెస్సెస్ డైరెక్షన్ లోనే పనిచేస్తూ వచ్చాయి.

ప్రధాని వంటి ఎంతటి ఉన్నత హోదాలో ఉన్నా ఆరెస్సెస్ సూచనలు సలహాలూ తీసుకునే పనిచేసేవారు. అలాంటి అరెస్సెస్ నుంచే నరేంద్ర మోడీ కూడా వచ్చారు. అయితే మోడీ 2014లో ప్రధాని అయ్యాక బీజేపీలో వ్యక్తి పూజ అధికం అయింది అన్న భావన ఏర్పడింది. బీజేపీ వంటి సంస్థాగతంగా బలమైన పార్టీలో వ్యక్తులకు ప్రాధాన్యత చాలా తక్కువ. పార్టీదే అగ్ర స్థానం.

కానీ గడచిన ఎన్నికలు అన్నీ మోడీ ఇమేజ్ తోనే సాగాయి. రెండు సార్లు బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కడంతో ఆరెస్సెస్ కూడా ఏమీ అనలేకపోయింది. కానీ ఈసారి చూస్తే బీజేపీ 240 సీట్ల వద్ద పడిపోయింది. కీలక రాష్ట్రాల్లో పార్టీ దెబ్బ తింది. యూపీలో 80 ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి దక్కినవి అక్షరాలా 32 మాత్రమే.

దాంతో బీజేపీలో ఏమి జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ మోడీ మీద ఇండైరెక్ట్ గానే కామెంట్స్ చేసింది. ఆరెస్సెస్ తన సొంత పత్రిక ఆర్గనైజర్ లో బీజేపీ నడక మీద పార్టీ పెద్దల పనితీరు మీద నిశితంగా విమర్శించింది.

మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్తిగానే బుద్ధి చెప్పాయని ఆరెస్సెస్ పేర్కొనడం అంటే అది మోడీకి షాక్ లాంటి స్టేట్మెంట్ అనే అంటున్నారు. బీజేపీ కార్యకర్తలు చాలా మంది మోడీ ఇమేజ్ ని ఆయన క్రేజ్ ని చూసి సంతోషించారు తప్ప దేశంలోని ప్రజల గొంతుకను ఏ మాత్రం వినిపించుకోలేదని ఆరెస్సెస్ తీవ్రంగానే విమర్శించింది.

ఆరెస్సెస్ వాలంటీర్ల సాయం కూడా బీజేపీ తీసుకోలేదు అని ఆక్షేపించింది. మొత్తానికి బీజేపీ రాజకీయ పోకడలు ఒంటెద్దు విధానాల పట్ల సరైన సమయంలోనే ఆరెస్సెస్ పెదవి విప్పి గట్టిగానే రియాక్ట్ అయింది. 400 పార్ అని ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాన్ని పార్టీ కార్యకర్తలు నేతలే సీరియస్ గా తీసుకోలేదు అని అరెస్సెస్ హాట్ కామెంట్స్ చేసింది.

మొత్తానికి చూస్తే ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందని అర్ధం అవుతోంది. బీజేపీ సాధించిన ఈ ఫలితాలు గుణపాఠం అని కూడా చెప్పడం చూస్తే బీజేపీ ప్రక్షాళనకు ఆరెస్సెస్ సిద్ధపడుతుంది అని అంటున్నారు. తొందరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కూడా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఎంపిక చేస్తారని అంటున్నారు. అలాగే ఇక మీదట బీజేపీ ప్రభుత్వ పనితీరుని కూడా క్లోజ్ గా మోనిటరింగ్ చేస్తారు అని అంటున్నారు.

గత రెండు సార్లూ పూర్తి మెజారిటీ వచ్చిన నేపధ్యంలో ఆరెస్సెస్ ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈసారి మాత్రం ఆరెస్సెస్ చెప్పినట్లుగా వినాల్సిన అవసరం అయితే బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు. మొత్తానికి ఆరెస్సెస్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ని బీజేపీ పెద్దలు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. అదే విధంగా రానున్న రోజులలో ఆరెస్సెస్ తన పట్టుని బిగించే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News