బాబోయ్ రుషికొండ
అవునా బాబోయ్ అనాల్సిందేనా. అదేంటి అక్కడ ఏముందని. కొంపదీసి దెయ్యం ఏమైనా ఉందా అంటే ఏమో దాని కంటే పెద్దదేనేమో అన్న మాట కూడా ఉంది
అవునా బాబోయ్ అనాల్సిందేనా. అదేంటి అక్కడ ఏముందని. కొంపదీసి దెయ్యం ఏమైనా ఉందా అంటే ఏమో దాని కంటే పెద్దదేనేమో అన్న మాట కూడా ఉంది. ఇంతకీ చూస్తే ఈ బాబోయ్ లేంటి, ఈ దెయ్యాలు అనడమేంటి ఎక్కడైనా సారూప్యం ఉందా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి కదండీ.
రుషికొండ పేరు అద్భుతంగా ఉంది. రుషులు ఒకనాడు అక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వారు అని చెబుతారు. ఆ రుషులు ఉన్న కొండ కాబట్టి రుషికొండ పేరు వచ్చిందని కూడా అంటారు. ఈ రుషికొండ విశాఖ టూ భీమిలీ వెళ్లే రూట్ లో ఉంది. ఎత్తైన కొండల నుంచి నీలి సముద్రాన్ని చూస్తూ ఉంటే వాటే మజా అనిపించకమానదు.
అందుకే విశాఖకు వచ్చే టూరిస్టుల కోసం అప్పట్లో అంటే 1980 దశకంలో నాటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ రుషికొండ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు కట్టారు. వాటిని మూడున్నర దశాబ్దాలుగా వినియోగిస్తూనే ఉన్నారు.
ఇక 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే రుషికొండ కాటేజీలు పాతబడ్డాయని వాటిని ఆధునాతనంగా నిర్మిస్తామని చెబుతూ కూలగొట్టింది. అది కాస్తా విపక్షాలకు ఆయుధం అయి టోటల్ గా రచ్చ రంభోలా అయింది. బ్రహ్మాండంగా ఉన్న కాటేజీలను ఎందుకు కూలగొట్టారు అని టీడీపీ జనసేన సహా వామపక్షాలు అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం మీద మండిపడ్డాయి.
ఈ క్రమంలోనే వైసీపీ దూకుడుగా వెళ్ళింది. సుమారు మూడేళ్ల పాటు అక్కడ అంతా ఇనుప కంచెలు వేసి మరీ ఏమి చేస్తుందో బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. అలా రుషికొండ మీద అయిదు వందల కోట్ల రూపాయలతో రాజప్రాసాదం నిర్మించింది.
అక్కడ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ఉంటుందని కూడా ప్రచారం జోరెత్తింది. విశాఖను రాజధానిగా చేసుకుని రుషికొండ మీద నుంచి పాలించాలని ఆయన భావించారని కూడా ప్రచారం సాగింది. మొత్తానికి విశేషం ఏంటి అంటే జగన్ ఆ రుషికొండ వైపు అడుగు పెట్టకుండానే మాజీ అయిపోయారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళి మొత్తం అందులో కట్టడాలను మీడియాకు చూపించారు. అలా జాతీయ స్థాయిలోనూ రుషికొండ నిర్మాణాలు ఒక లెవెల్ లో డిబేట్ కి వచ్చాయి.
ప్రభుత్వం ఇంత ఖరీదైన భవనాలు కూడా నిర్మిస్తుందా అని నోళ్ళు నొక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక రుషికొండ ప్యాలెస్ విషయంలో దుబారా చేశారు అని జగన్ మీద నిండు సభలో చంద్రబాబు సీఎం హోదాలో మండిపడ్డారు కూడా.
మొత్తం మీద వాటి మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ నాలుగు నెలలు అయింది కానీ రుషికొండ మీద ఏమీ తేల్చలేదు. విశాఖ వచ్చిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కూడా దీని మీద మీడియా వేసిన ప్రశ్నలకు బదులు ఇస్తూ రుషికొండ ప్యాలెస్ ని ఏమి చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి అది అసలైన సంకేతం అని విమర్శించారు.
ఇవన్నీ పక్కన పెడితే రుషికొండ ప్యాలెస్ కి రోజు వారీ నిర్వహణ ఖర్చు ఒక లక్ష రూపాయలు అవుతుందిట. ఈ నాలుగు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అర కోటి ఈ రూపంలో ఖర్చు చేసింది అని అంటున్నారు. అంటే పైసా ఆదాయం లేదు సరికదా ఈ ఖర్చు అదనంగా ఏమిటి బాబూ అని అంతా హడలిపోతున్నారు.
రిసార్టులుగా చేద్దామంటే ఆ విధంగా నిర్మాణాలు లేవు అని అంటున్నారు. కాన్ఫరెన్స్ లకు ఉపయోగిద్దామని అనుకుంటే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దాంతో ఏమి చేయాలో తెలియక కూటమి ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. రుషికొండ తెల్ల ఏనుగు మాదిరిగా తయారు అయింది అని కూడా అంటున్నారు. విశాఖలో రుషికొండ భవనాల మీదనే గత నాలుగేళ్ళుగా పోరాడిన కూటమి నేతలు పార్టీలు ఇపుడు రుషికొండ పేరు ఎత్తితే బాబోయ్ అనేసే పరిస్థితి ఉందిట. మరి దీని మీద కూటమి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో కానీ ఈ భవనాలు మాత్రం అలా వేస్ట్ గానే పడి ఉన్నాయని అంటున్నారు.