వైసీపీలో సజ్జల అనధికారిక ఒంటరి?

సరే... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. వైసీపీలో ‘జగన్ తర్వాత సజ్జల’ అనే స్థాయి ప్రచారం, వ్యవహారం అయితే నడిచింది అనేది సత్యమనే చెప్పాలి!

Update: 2024-10-18 16:56 GMT

సజ్జల రామకృష్ణారెడ్డి... వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం తర్వాత అంతటి వెలుగు వెలిగిన వ్యక్తి అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో... ఎమ్మెల్యేలు, మంత్రులను మించి వీవీఐపీ ప్రోటోకాల్ సజ్జలకు దక్కేదని చెబుతుంటారు!జగన్ అపాయింట్మెంట్ దొరకని సమయంలో.. సజ్జల దర్శనం దొరికితే చాలు అని అప్పట్లో చాలా మంది నేతలు భావించేవారని చెబుతుంటారు.

సరే... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. వైసీపీలో ‘జగన్ తర్వాత సజ్జల’ అనే స్థాయి ప్రచారం, వ్యవహారం అయితే నడిచింది అనేది సత్యమనే చెప్పాలి! ఈ విషయంలో వైసీపీ నాయకుల్లో ఎవరి అనుభవాలు వారికి ఉన్నాయని అంటుంటారు. అయితే.. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం కొంతమంది నర్మగర్భంగా బయటపడగా.. మరికొంతమంది కాస్త బాహాటంగానే స్పందించారు! మరికొంతమంది ఇప్పటికీ లోలోన మదనపడుతున్నారని అంటుంటారు.

ఎన్నికల ఫలితాల అనంతరం కాస్త తేరుకున్న జగన్.. పార్టీ నేతలతో నిర్వహించిన పలు సమావేశాల్లో సజ్జల చివరి వరుసలో కుర్చుని కనిపించారంటూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో.. సజ్జలను జగన్ అనధికారికంగా దూరం పెట్టారా? అనే ప్రశ్నలూ ఆన్ లైన్ వేదికగా దర్శనమిచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల సజ్జలపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయబడ్డాయి!

ఇదే క్రమంలో... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి పలువురు వైసీపీ ముఖ్యనాయకులతో పాటు సజ్జలకూ నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో స్థానిక నాయకులు ఇద్దరు, ముగ్గురు మినహా మరెవరూ కనిపించకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఎక్కడెక్కడో జిల్లాల నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు సజ్జల కోసం వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు అని సరిపెట్టుకున్నా... కనీసం ప్రెస్ మీట్ పెట్టో, ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టో ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఎక్కడా కనిపించలేదు! 'ఇది తప్పుడు కేసు, ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగం' అని సాక్షి పత్రికలో కథనాలు రావడం మినహా ఖండనలు పెద్దగా కనిపించలేదు!

కాకపోతే... లాయర్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం సజ్జలతో పాటు మంగళగిరి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం, ఆయన లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగడం మాత్రం కనిపించింది. దీంతో... సజ్జల ఒంటరి కాదని.. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న వారిలో ఒకరిగా చెప్పే పొన్నవోలు ఆయనతోనే ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాకపోతే... గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, కీలక నేతలు, ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అభిప్రాయాన్ని, వైఖరిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే నేతలు మాత్రం ఈ వ్యవహారంలో మౌనాన్నే తమ భాషగా చేసుకోవడంపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. దీన్నే... 'వైసీపీలో సజ్జల అనధికారిక ఒంటరి' అంటూ విశ్లేషిస్తున్నారని తెలుస్తోంది!

Tags:    

Similar News