జనసేనలోకి వైసీపీ కాపు నేత!?

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-09-18 08:30 GMT

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలో తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను కూడా ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఆయన వైసీపీని వీడటానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 27 లేదా 28 తేదీల్లో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు తయారుచేస్తున్నారని సమాచారం. అలాగే జనసేన పార్టీ జెండా దిమ్మెలను కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

కీలకమైన కాపు సామాజివర్గానికి చెందిన సామినేని ఉదయభాను 1999, 2004ల్లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. మొత్తం మీద మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కాపు సామాజికవర్గానికి చెందిన ఉదయభానును మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ అధికారంలోకి రాగానే వార్తలు వినిపించాయి. అయితే ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేయరన్న కారణంతోనే ఆయనను వైఎస్‌ జగన్‌ పక్కనపెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ అప్పుడు కూడా ఇదే కారణంతో ఉదయభానుకు మంత్రి పదవి దక్కలేదని టాక్‌ నడిచింది. కాపుల్లో ఆయన కంటే చాలా జూనియర్లకు, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి కూడా జగన్‌ మంత్రులుగా చాన్సు ఇచ్చినా ఉదయభానును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలకు వైసీపీ కాపు నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌ వంటివారు ముందుకొచ్చినా సామినేని ఉదయభాను మాత్రం పవన్‌ ను విమర్శించింది లేదు. 2009 ఎన్నికల సమయంలోనూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో తన తరఫున ప్రచారానికి వచ్చిన సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత.. చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడుతుండటంతో పక్కనే ఉన్న సామినేని ఉదయభాను అడ్డుకున్నారు.

చిరంజీవితో సామినేని ఉదయభానుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంతోనే పవన్‌ కళ్యాణ్‌ ను తాను విమర్శించబోనని వైఎస్‌ జగన్‌ కు తేల్చిచెప్పేశారని అంటారు. ఈ కారణంతోనే సీనియర్‌ అయినప్పటికీ ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వకుండా జూనియర్లయిన గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజాలకు జగన్‌ మంత్రి పదవులు ఇచ్చారనే వాదన ఉంది.

కాగా 2024 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను వైసీపీ తరఫున మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఉదయభాను జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే ఇంకా ఉదయభాను నుంచి అధికారిక సమాచారం ఏమీ వెలువడలేదు. కానీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన జనసేనలో చేరడం ఖాయమన్నట్టు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News