జ్వరానికి ఇవి ఓ ప్రధాన కారణం... ఏమిటీ 'స్క్రబ్ టైఫస్'?
తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. తమిళనాడులోని 37 గ్రామాల నుంచి 32 వేల మందిని పరిశీలించిన అనంతరం ఈ వివరాలను తాజా అధ్యయనం వెల్లడించింది.;

జ్వరం ఎందుకు వస్తుందని ఎవరైనా అడిగితే... దోమలు కుట్టడం వల్ల, ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల, రకరకాల ఇన్ ఫెక్షన్స్ వల్ల వస్తుందని చెబుతుంటారు. అయితే... దేశంలో ఏటా సుమారు పదో వంతు గ్రామీణ జనాభాలో ఓ సరికొత్త ఇన్ ఫెక్షన్ ప్రభావం వల్ల జ్వరం వస్తోందని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ ఇన్ ఫెక్షన్ విషయాన్ని తెరపైకి తెచ్చింది.
అవును... గ్రామీణ జనాభాలో "స్క్రబ్ టైఫస్" ఇన్ఫెక్షన్ ప్రభావం కనపడుతోందని.. బ్యాక్టీరియా సోకిన లార్వల్ మైట్ కాటు ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ జ్వరాలకు ఓ ప్రధాన కారణంగా ఉందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. తమిళనాడులోని 37 గ్రామాల నుంచి 32 వేల మందిని పరిశీలించిన అనంతరం ఈ వివరాలను తాజా అధ్యయనం వెల్లడించింది.
వాస్తవానికి వీటి ద్వారా జ్వరం సోకిన వారు గ్రామీణ జనాభా కావడంతో వారు తక్కువగా ఆస్పత్రుల్లో చేరుతుండటంతో పాటు.. ఆ ఇన్ఫెక్షన్ ను గుర్తించి, పరీక్షలను నిర్వహించే యంత్రాంగం కూడా కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండటం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడం లేదని అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనం ఫలితాలు తాజాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి. వెల్లురులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్.ఎస్.హెచ్.ఎం.టీ.ఏ) ఈ అధ్యయనం చేపట్టాయి.
వాస్తవానికి బ్యాక్టీరియా సోకిన లార్వల్ మైట్ (చిగ్గర్లు) ఆసియాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొక్కల వ్యర్థాలు, మట్టి, గడ్డిపై ఎక్కువగా కనిపిస్తాయి. రికెట్సియా ఫ్యామిలీకి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.
ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఆగస్టు - ఫిబ్రవరి మధ్య సంభవిస్తాయని ఈ అధ్యయన ప్రధాన పరిశోధకుడు, ఎల్.ఎస్.హెచ్.ఎం.టీ.ఏ ప్రొఫెసర్ వోల్ఫ్ పీటర్ స్మిత్ చెప్పారు. ఇది సంక్రమించిన పదిరోజుల తర్వాత జ్వరం, దద్దుర్లు, తల నొప్పి వంటి లక్షణాలు ప్రారంభమవుతాయని.. ఆగ్నేయాసినా, ఇండోనేషియా, జపాన్, చైనా, భారత్ లోని గ్రామీణ ప్రాంతాలు దీని వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని వెల్లడించారు.