మరో వివాదంలో సెబీ ఛైర్ పర్సన్.. ఈసారి ఏకంగా..?

ఆ మధ్యన హిండెన్ బర్గ్.. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆమె మీద సంచలన ఆరోపణలు.. విమర్శలు చేయటం తెలిసిందే.

Update: 2024-09-04 22:30 GMT

రాజకీయాల్ని పక్కన పెడితే ఇతర రంగాలకు సంబంధించి అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారి మీద విమర్శలు.. ఆరోపణలు చాలా అరుదుగా వస్తుంటాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సెబీ ఛైర్మన్ మాధవి పురీ బుచ్ (ఇప్పుడు ఛైర్ పర్సన్ ఉన్నారు) మీద వస్తున్న విమర్శలు.. ఆరోపణల పరంపర సంచలనంగా మారింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆమెను టార్గెట్ చేసేలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ మధ్యన హిండెన్ బర్గ్.. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆమె మీద సంచలన ఆరోపణలు.. విమర్శలు చేయటం తెలిసిందే.

తాజాగా ఆమె పని తీరు మీద సరికొత్త ఆందోళనలు తెర మీదకు వచ్చాయి. పని సమయాల్లో కింది సిబ్బంది మీద పరుష పదజాలాన్ని వాడుతున్నారని.. అవాస్తవ లక్ష్యాన్ని విధిస్తున్నారని పేర్కొంటూ సెబీ అధికారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేశారు. ఇలాంటి తీరు చాలా అరుదుగా చోటు చేసుకుంటుదని చెబుతున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల మాధవి పని తీరు మీద ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేసినట్లుగా పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

‘‘గ్రీవెన్స్ ఆఫ్ సెబీ ఆఫీసర్స్ - ఎ కాల్ ఫర్ రెస్పెక్ట్’ పేరు మీద 500 మంది సెబీ ఉద్యోగులు ఆమె మీద చేసిన ఫిర్యాదు కాపీ మీద సంతకాలు చేసినట్లుగా చెబుతున్నారు. స్నేహపూర్వక విధానాలు.. పని సమయంలో వేధింపులు లాంటి అంశాలపై సెబీ అధికారుల్లో ఆందోళన వ్యక్తం కావటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. కిందిస్థాయి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కేకలు వేయటం.. తిట్టటం.. బహిరంగంగా అనుమానిస్తున్నట్లుగా మాట్లాడటం లాంటివి ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు.

అసిస్టెంట్ మేనేజర్.. ఆ పై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో వెయ్యి వరకు ఉంటారు. వారిలో యాభై శాతం మంది ఆమె పని తీరును తప్పు పడుతూ ఫిర్యాదు ఇచ్చారు. మాధవి తీరుతో తమ మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని పేర్కొంటున్నారు. గతంలోనే ఆమె మీద సెబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయగా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేశారు.

ఈ ఏడాదికి సంబంధించి కీ రిజల్ట్ ఏరియా లక్ష్యాలను 20-50 శాతం మేర పెంచారని.. డిసెంబరు నాటికి ఉద్యోగులు ఆ లక్ష్యాల్ని సాధించాలని అదికారులు ఆదేశించారని పేర్కొన్నారు. ఈ లక్ష్యం వాస్తవానికి దరిదాపుల్లో కూడా లేదని.. దీంతో తీవ్రమైన ఒత్తిడి.. ఆందోళనల్ని పెంచుతుందని చెబుతున్నారు. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను అన్ని విభాగాలతో సమీక్షిస్తారని చెబుతున్నారు. తాజా ఫిర్యాదును పక్కన పెట్టి.. ఇప్పటివరకు మాధవి మీద వచ్చిన తీవ్ర ఆరోపణల్ని చూస్తే..

- సింగపూర్, మారిషస్ లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధవి అదానీ గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ ఆరోపించింది.

- 2017 - 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.

- సెబీ సంస్థకు ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తూ మరో సంస్థ నుంచి జీతం తీసుకోవటం నిబంధనలకు విరుద్దమంటున్నారు.

- అయితే.. ఈ ఆరోపణల్ని మాధవి తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News