జనవరి 9, సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు ఇది
తెలుగుజాతిలో చైతన్యం రగిల్చిన సమయం, నవశకానికి నాంది పలికిన ముహూర్తం. కొత్త చరితకు బీజం పడిన క్షణం.
తెలుగుజాతిలో చైతన్యం రగిల్చిన సమయం, నవశకానికి నాంది పలికిన ముహూర్తం. కొత్త చరితకు బీజం పడిన క్షణం. సంక్షేమ రాజ్యం పురుడుపోసుకున్న మహాద్భుతం జనవరి 9. 1983లో ఈ తేదీనే అభినవ రాముడు, వెండితెర వెలుగు, తెలుగు ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా మదరాసీలనే పిలుపుతో తెలుగువారికి గుర్తింపులేని రోజుల్లో చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడా అంటూ ఆ మహా మనిషి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.
ఎన్టీఆర్ ఈ పేరే చరిత్ర. ఆ చరిత్రకు బీజం పడిన రోజు జనవరి 9. 1983 జనవరి 9న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా మహానేత ఎన్టీఆర్ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి తారక రామారావు అను నేను అంటూ ఆయన పలికిన పలుకులు నేటికీ ప్రతి తెలుగు ఇంట ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కాకలు తీరిన కాంగ్రెస్ నేతలను మట్టి కరిపించి అశేష జనవాహిని సమక్షంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షేమం రాజ్యానికి ప్రాణం పోశారు. జనతా వస్త్రాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వం ఏర్పడి 40 ఏళ్లు కావస్తోంది.
పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తెలుగు ప్రజలకు వెలుగులు పంచారు ఎన్టీఆర్. అప్పటివరకు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ప్రజల బాధలను చూసి చలించిపోయారు. తెలుగు వారికి జరుగుతున్న అవమానాలను భరించలేకపోయారు. ఢిల్లీకి సలాం కొట్టే నాయకులను మట్టి కరిపించి జన రంజక పాలనకు తెరతీశారు. వెండి తెర నుంచి రాజకీయ రంగానికి మారిన ఎన్టీఆర్.. అక్కడా, ఇక్కడా అగ్రజుడిగానే వెలుగొందారు. మాటలతో మంట పుట్టించి, పదాలు దట్టించి, కాక పుట్టించి, పౌరుషాగ్ని రగిలించి, జనాన్ని అదిలించి, కదిలించి చరిత్ర సృష్టించారు.
1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నట్లు తొలిసారి ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లోకి వచ్చారు. అక్కడి నుంచే చైతన్యరథంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో కదలిక తెచ్చారు. 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ 9 నెలల పయనమే తెలుగు జాతి తలరాతను మార్చిందని ఇప్పటికీ చెబుతుంటారు. 201 సీట్లు గెలిచి బడుగు బలహీన వర్గాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు అప్పటివరకు ప్రభుత్వం, ప్రమాణ స్వీకారం అంటే గవర్నర్ బంగ్లా రాజభవనే అన్న భావన తొలగించి, ప్రభుత్వ మంటే ప్రజలే అని చాటిచెప్పేందుకు అశేష జనవాహిని మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా జనం సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత ఎన్నికైన నేతలు ఇప్పటికీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం గమనార్హం.