మరోసారి ట్రోల్ అవుతున్న షర్మిల!
ఈ నేపథ్యంలో షర్మిల ట్రోలర్స్ కు చిక్కుకుండా మాట్లాడితే బెటరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపైన చాలా ట్రోల్స్ ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఆమె తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. పాదాలతో చేసే యాత్ర కాబట్టి పాదయాత్ర అంటారని అప్పుడు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే తన అర చేతిని చూపుతూ దీన్ని గుప్పిట అని ఎందుకంటామో తెలుసా.. ఇది పిడికిలి కాబట్టి అంటూ వ్యాఖ్యానించి ట్రోల్ అయ్యారు.
అలాగే.. ఆంధ్రాకు షర్మిలకు తెలంగాణలో పని ఏంటంటూ తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. ‘ఆడపిల్ల అని ఎందుకంటామో తెలుసా.. ఈడ పిల్ల కాదు.. అక్కడ పిల్ల కాబట్టి’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. దీనిపైనా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇలా వరుసగా ఆమె అప్పట్లో ట్రోల్స్ కు గురయ్యారు.
తాజాగా మరోసారి ట్రోల్స్ కు గురయ్యారు. తాజాగా ఆంధ్రాలో వరద పరిస్థితులపై మాట్లాడిన ఆమె మరోసారి ట్రోలర్స్ కు చిక్కారు. ఇప్పుడు రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ అని షర్మిల వ్యాఖ్యానించారు. దీంతో ఆమెను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
గతంలో ఆమె మాట్లాడిన మాటలకు దీనిని కూడా కలిపి కొత్తగా రీల్స్, వీడియోలు చేస్తూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర, ఆడపిల్ల అంటే ఈడ పిల్ల కాదు కాబట్టి, రైనీ సీజన్ అంటే రెయిన్స్ వచ్చే సీజన్.. ఇలా షర్మిల మాట్లాడిన మాటలతో ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల ట్రోలర్స్ కు చిక్కుకుండా మాట్లాడితే బెటరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ తెలిసిన చిన్న చిన్న సిల్లీ విషయాలను కూడా ఆమె ఏదో కొత్తగా తనకే తెలిసినట్టు చెబుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోలర్స్ కు చిక్కకుండా ఉండాలంటే ఆచితూచి వ్యవహరించాలంటున్నారు.
కాగా ఇటీవల ఎన్నికలలో వైఎస్ షర్మిల కడప నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అలాగే బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పైనా షర్మిల తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.