ష‌ర్మిల వ‌ర్సెస్ సునీత‌.. 'మెసేజ్‌'ల యుద్ధం.. !

ఈ విష‌య‌మే ఇప్పుడు వైఎస్ కుటుంబంలోని ఆడ‌ప‌డుచుల మ‌ధ్య వివాదానికి దారితీసిన‌ట్టు తెలుస్తోంది.

Update: 2025-02-15 20:30 GMT

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. అంతా అనుకున్న‌ట్టే జ‌ర‌గాల‌ని రూల్ ఏమీ ఉండ‌దు. కాబ‌ట్టి.. ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీలు.. చేసిన కామెంట్లు అన్నీ.. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా కొన‌సాగుతాయ‌ని చెప్ప లేం. ఈ విష‌య‌మే ఇప్పుడు వైఎస్ కుటుంబంలోని ఆడ‌ప‌డుచుల మ‌ధ్య వివాదానికి దారితీసిన‌ట్టు తెలుస్తోంది. త‌న తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌పై డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే.

2019 ప్ర‌థ‌మార్థంలో జ‌రిగిన ఈ దారుణ హ‌త్య‌పై సునీత కుటుంబం న్యాయ పోరాటం చేస్తోంది. అయితే.. సొంత సోద‌రుడు.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూస్తాయ‌ని.. దోషుల‌ను గుర్తిస్తారిని ఆమె ఆశ‌లు పెట్టుకున్నా.. కార‌ణాలు ఏవైనా అది జ‌ర‌గ‌లేదు. ఇవే.. 2024 ఎన్నిక‌ల స‌మ‌యం లో సునీత‌, వైఎస్ కుటుంబంలోని మ‌రోఆడ‌ప‌డుచు, జ‌గ‌న్ సోద‌రి,కాంగ్రెస్‌పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌కు ఆయుధాలుగా మారాయి. వివేకా హత్య‌తోపాటు.. జ‌గ‌న్ స‌ద‌రు నిందితుల‌ను కాపాడుతున్నారంటూ.. అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు.

మొత్తానికి ఎక్క‌డిక‌క్క‌డ సెంటిమెంటును సృష్టించి వైసీపీ ఓట‌మికి కార‌ణంగా కూడా మారారు. అయితే.. స‌ర్కారు మారింది. ఎనిమిది నెల‌లు కూడా గ‌డిచింది. కానీ వివేకా దారుణ ఘ‌ట‌న‌లో ఎవ‌రినైతే.. వారు నిందితులుగా చూపించారో.. స‌ద‌రు నాయ‌కుడిని అరెస్టు చేయించ‌లేక పోతున్నారు. పైగా.. ఈ కేసు విష యంలో ప్ర‌భుత్వాన్ని కూడా ముందుకు వ‌డివ‌డిగా న‌డిపించే విష‌యంపై విఫ‌ల‌మ‌వుతున్నారు. దీనికి కార‌ణాలు ఏమైనా కూడా.. సునీత‌లో మాత్రంఅస‌హ‌నం పెరుగుతోంది.

ఇప్ప‌టికే రెండు సార్లు హోం మంత్రి అనిత‌ను క‌లుసుకున్న సునీత‌.. కేసు విచార‌ణ‌ను వేగం చేయాల‌ని అభ్య‌ర్థించారు. అయినా.. కేసు ముందుకు సాగ‌డం లేదు. ఈ విష‌యంలో గ‌తంలో జోరుగా ప్ర‌చారం చేసి న‌.. ష‌ర్మిల‌.. త‌ర్వాత సైలెంట్ అయ్యారు. ఎనిమిది నెల‌లుగా వివేకా పేరును కూడా ఆమె ప్ర‌స్తావించ‌డం లేదు. జ‌గ‌న్‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల‌.. వివేకా కేసుపై మాత్రం నోరెత్త‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే సునీత‌-ష‌ర్మిల మ‌ధ్య గ్యాప్ పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇద్ద‌రి మ‌ధ్య మెసేజ్‌ల యుద్ధం కూడా జ‌రుగుతోంద‌ని.. క‌డ‌ప‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ''ఇలా చేశావేంటి అక్కా!'' అని సునీత ప్ర‌శ్నిస్తోంద‌ని.. దీనికి ష‌ర్మిల మౌనంగా ఉన్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. వివేకా కేసు విష‌యంలో అక్కా చెల్లెళ్ల మ‌ధ్య తొలిసారి విభేదాలు తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News