ఏపీలో కాదు.. అండమాన్ లోనైనా పనిచేస్తా.. షర్మిల హాట్ కామెంట్స్!
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిల దంపతులు పార్టీ అగ్ర నేత సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ మేరకు ఆమె న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏపీ పీసీపీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, కేసీ వేణుగోపాల్, ఏపీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, కొప్పల రాజు తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో షర్మిలతోపాటు ఆమె భర్త అనిల్ కుమార్ పాల్గొన్నారు. షర్మిల మెడలో ఖర్గే, రాహుల్ గాంధీలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అనిల్ కుమార్ మెడలోనూ కండువా వేయడానికి ఖర్గే ప్రయత్నించగా ఆయన నవ్వుతూ సున్నితంగా తిరస్కరించారు. షర్మిల సైతం నవ్వుతూ ఖర్గేకు ఏదో చెప్పడం కనిపించింది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిల దంపతులు పార్టీ అగ్ర నేత సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి బయటకొచ్చాక మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తన తండ్రి వైఎస్సార్ కు సంతోషం కలిగించే విషయమన్నారు. తనకు కూడా పార్టీలో చేరడం పట్ల సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం గర్వంగా ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి విధేయురాలిగా పనిచేస్తానని, పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. అండమాన్ లో చేయమన్నా చేస్తానని.. ఆంధ్రాలో చేయమన్నా చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల గుర్తు చేశారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. వైఎస్సార్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే వైఎస్సార్ కల అని చెప్పారు. దాన్ని నెరవేర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమని షర్మిల తెలిపారు. మణిపూర్ లో జరిగిన ఘటనలతో ఓ క్రిస్టియన్ గా బాధపడ్డానని, అక్కడ వందలాది చర్చిలను తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక, తెలంగాణపై ప్రభావం చూపిందని తెలిపారు. అందువల్లే ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం తన వంతు కృషి చేశానని వివరించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.
కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
కాగా కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారని టాక్.