అవినీతి డైనోసార్ అనాలేమో... ఆస్తులు రూ.250 కోట్ల పైనే!

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసిన నేపథ్యంలో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

Update: 2024-02-08 03:57 GMT

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసిన నేపథ్యంలో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కోర్టు మరో 14 రోజులు రిమాండ్‌ ను పొడగించింది. అయితే... విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటపడుతున్న ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారని తెలుస్తుంది! దీంతో... ఇతడు అవినీతి తిమింగళం కాదు.. డైనోసార్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి!!

అవును... శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా తవ్విన కొద్దీ బహిర్గతమవుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధకశాఖ ప్రాథమిక అంచనా అని తెలుస్తుంది. ఇప్పటివరకూ జరిగిన విచారణలో శివబాలకృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులు, బినామీల పేరిట 214 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్స్, 29 ప్లాట్స్, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది.

ఇలా వందల ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమిలో ఒక్క జనగామ జిల్లాలోనే 102 ఎకరాలు కొన్నట్టు తేలింది. వాస్తవంగా సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన ఆయన... యాదాద్రి భువనగిరి జిల్లాలో 66 ఎకరాలు, నాగర్‌ కర్నూల్‌ లో 39 ఎకరాలు, సిద్దిపేటలో ఏడు ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో అర ఎకరం భూములు కొన్నట్లు తెలుస్తుంది. ఇక ఇళ్ల స్థలాల విషయానికొస్తే... ఇవి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా.. రంగారెడ్డిలో 12, యాదాద్రి భువనగిరిలో 8, సంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఇళ్ల స్థలాలు కొన్నట్లు గుర్తించగా... ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండేసి చొప్పున ఇళ్లస్తలాలు కొన్నట్లు గుర్తించారని తెలుస్తుంది. వీటితో పాటు పుప్పాలగూడలోని విల్లాతో పాటు హైదరాబాద్‌ నగరంలో 4, రంగారెడ్డి జిల్లాలో 3 సూపర్ లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు బయటపడిందని అంటున్నారు.

ఈ ఆస్తులన్నీ ప్రధానంగా నలుగురు పేర్లపై పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా... శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌, అతడి భార్య అరుణ, బంధువు భరత్‌ కుమార్‌ తోపాటు మరొకరి పేరిట శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శివనవీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.. మిగిలిన ముగ్గురినీ విచారించడంపై దృష్టి సారించారు! ఇదే సమయంలో... శివబాలకృష్ణ, కుటుంబసభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించిందని తెలుస్తుంది!


Tags:    

Similar News