మోడీది ఒకటే డైలాగ్...బోరు కొడుతోందా ?

ఎన్నికలు వస్తే చాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రచారానికి వచ్చే మోడీ అక్కడ వారి అవినీతిని ఎండగడుతున్నారు.

Update: 2024-11-18 03:26 GMT

ఎన్డీయే సారధిగా పదేళ్లుగా కేంద్రంలో ప్రధానిగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ విపక్షల మీద చేసే విమర్శలు ఫుల్ రొటీన్ గా ఉంటున్నాయా అన్న చర్చ సాగుతోంది. అవి బాగా అరిగి పోయిన డైలాగులుగా మారిపోయాయా అన్న మాట కూడా వినిపిస్తోంది. అదే టైం లో మోడీ చేస్తున్న ఈ విమర్శలలో పంచులు పెద్దగా పేలడం లేదా అన్నది కూడా అంతా అంటున్న మాటగా ఉంది.

ఎన్నికలు వస్తే చాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రచారానికి వచ్చే మోడీ అక్కడ వారి అవినీతిని ఎండగడుతున్నారు. సరే ఆయన ప్రత్యర్ధులను విమర్శించడాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ ఆయన ధాటీగా చేస్తున్న ఆ విమర్శలు ఆ తరువాత మాత్రం ఎటూ కాకుండా పోతున్నాయి.

అంటే వాటికి కొనసాగింపు అసలు ఉండడం లేదు అని అంటున్నారు. అదెలా అంటే దేశానికి పెద్దగా ప్రధాని స్థానంలో ఉన్న నాయకుడు చేసే తీవ్రమైన ఆరోపణల మీద దేశమంతా ఆసక్తిగా చూస్తుంది. వాటి మీద చర్యలు ఉంటాయేమో అని కూడా ఆలోచిస్తుంది. ఒక ప్రధాని తన వద్ద ఆధారాలు పూర్తిగా ఉండబట్టే ఈ తరహా ఆరోపణలు చేస్తారు అని కూడా భావిస్తుంది.

అయితే నరేంద్ర మోడీ మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, ఆ మీదట వాటి ఊసు అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. దానికి ఉదాహరణలు కూడా ఎన్నో చెబుతూంటారు. 2019 ఎన్నికల వేళ ఏలూరు బీజేపీ సభలో ప్రధాని మాట్లాడుతూ ఆనాటి టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం గా మారింది అని అతి పెద్ద ఆరోపణ చేశారు.

దాని మీద చర్చ చాలా పెద్ద ఎత్తున సాగింది కూడా. తీరా చూస్తే ఏపీలో చంద్రబాబు ఓటమి పాలు అయ్యారు. కేంద్రంలో బీజేపీ గెలిచింది. కానీ ప్రధాని చంద్రబాబు మీద చేసిన ఆరోపణల మీద విచారణ ఏమైనా జరిగిందా అంటే లేదు, తీరా 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో టీడీపీ కూటమితో కలసి బీజేపీ పోటీ చేసింది.

ఇది ఒక ముచ్చట అయితే 2024 ఎన్నికల వేళ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ మీద కూడా ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఇపుడు అయిదు నెలల పాలన కేంద్రం పూర్తి చేసుకుంది. మరి జగన్ మీద చేసిన ఆరోపణల మీద పర్యవసానాలు ఏమిటి అంటే జవాబు లేదు అని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోని ముఖ్యమంత్రుల మీద కూడా ప్రధాని ఆరోపణలు చేస్తూంటారు. అక్కడ అవినీతి జరిగిందని అంటారు. ఆ డబ్బులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి నిధులుగా వాడుతున్నారు అని కూడా ఆరోపిస్తూంటారు. లేటెస్ట్ గా చూస్తే అలాంటి ఆరోపణలు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద చేశారు.

దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మీద చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని కూడా సిద్ధరామయ్య సవాల్ చేశారు.

ఇంతకీ సిద్ధరామయ్య మీద మోడీ చేసిన ఆరోపణలు చూస్తే కర్ణాటక ప్రజలను దోచుకుని ఆ డబ్బుని మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోంది అని మోడీ ఆరోపించారు. దానికి చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన సిద్ధరామయ్య ప్రధాని ఆ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రజలను దోచుకుని డబ్బులు తెచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నామన్నది ఆధారం లేని ఆరోపణగా అంటున్నారు. ప్రధాని మోడీ అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.

ఆయన అలా తమ మీద బురద జల్లి వెళ్లిపోతున్నారని కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రధాని తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించగలరా తన సవాల్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. మరి సిద్ధరామయ్య చేసిన ఆరొపణలకు మోడీ కానీ బీజేపీ పెద్దలు కానీ ఎలా రియాక్ట్ అవుతారో లేక వాటిని అలా వదిలేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు