సిరాజ్.. ఆటో డ్రైవర్ కొడుకు నుంచి జూబ్లీహిల్స్ లో 600 గజాల దాకా

సిరాజ్‌ కు ఇంటి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌ లో కావడం గమనార్హం. సిరాజ్ కు ఇచ్చిన స్థలం విస్తీర్ణం 600 చదరపు గజాలు.

Update: 2024-08-10 01:30 GMT

మొహమ్మద్ సిరాజ్.. పన్నెండేళ్ల కిందట హైదరాబాద్ గల్లీల్లో సాధారణ ఆటగాడు.. కనీసం 16 ఏళ్ల వయసు వచ్చేవరకు అతడు టెన్నిస్ బాల్ తోనే ఆడాడు.. 19 ఏళ్లకు కానీ క్లబ్ క్రికెట్ లోకి అడుగుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు టీమ్ ఇండియా కు మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ బౌలర్. కొన్నిసార్లు ఇతడే పేస్ దళపతి. టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.

ప్రపంచ కప్ జట్టులోని ఏకైక హైదరాబాదీ..

టీమ్ ఇండియా 1983, 2011లో వన్డే ప్రపంచ కప్ లు, 2007, 2024 టి20 ప్రపంచ కప్ లు గెలిచింది. మొహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి వంటి బ్యాట్స్ మెన్లు, అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు వంటి బౌలర్లు భారత్ కు ఆడారు. కానీ, వీరెవరూ నాలుగు (రెండు వన్డే, రెండు టి20) ప్రపంచ కప్ లు గెలిచిన జట్లలో సభ్యులు కాదు. అజహరుద్దీన్ వరుసగా మూడు వన్డే ప్రపంచకప్ లకు కెప్టెన్. కానీ, వీరెవరికీ సాధ్యం కాని రికార్డు సిరాజ్ సొంతమైంది. అదే ప్రపంచ కప్ (టి20) గెలిచిన జట్టులోని హైదరాబాదీ. అంతేకాదు.. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఏకైక హైదరాబాదీ కూడా.

600 గజాల నజరానా..

మొహమ్మద్ సిరాజ్ తండ్రి గౌస్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ లో ఉండగా గౌస్ చనిపోయాడు. ఆ సమయంలో సిరాజ్ హైదరాబాద్ రాలేకపోయాడు. జట్టు సభ్యులంతా అతడికి అండగా నిలిచారు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నెగ్గి సిరాజ్ లో మానసిక స్థైర్యం నింపారు. కాగా, టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడైన సిరాజ్.. టి20 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సభ్యుడిగా రికార్డు అందుకున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానంచింది. సిరాజ్‌ కు ఇంటి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌ లో కావడం గమనార్హం. సిరాజ్ కు ఇచ్చిన స్థలం విస్తీర్ణం 600 చదరపు గజాలు. టి20 ప్రపంచకప్‌ గెలిచాక హైదరాబాద్‌ లో ఘన స్వాగతం అందుకున్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి టీమ్‌ ఇండియా జెర్సీని బహూకరించాడు. ఆ సమయంలోనే సిరాజ్‌ ను అభినందించిన సీఎం.. హైదరాబాద్‌ లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సిరాజ్ కు నజరానా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఇంటి స్థలం కేటాయించింది. ఇక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News