ప్రముఖులు పోస్టు చేసిన 4 లక్షల కోట్ల డాలర్ల ట్వీట్ తప్పా?
మీడియాను మింగేసేలా మారిన సోషల్ మీడియా పుణ్యమా అని అబద్దాలు.. అసత్యాలు నిజాలు.. వాస్తవ అంశాలుగా భావించే రోజులు ఎక్కువ అవుతున్నాయి
మీడియాను మింగేసేలా మారిన సోషల్ మీడియా పుణ్యమా అని అబద్దాలు.. అసత్యాలు నిజాలు.. వాస్తవ అంశాలుగా భావించే రోజులు ఎక్కువ అవుతున్నాయి. అవగాహనరాహిత్యంతో సామాన్యులు షేర్ చేసే సమాచారంలో తప్పు ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు.. అధికారానికి.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వారు చేసే పోస్టుల్లో తప్పులు ఉండే దాన్ని ఏమనాలి? అలాంటి తీరును ఎలా తప్పు పట్టాలన్న భావన కలుగక మానదు.
ఈ ఆదివారం దేశ ప్రజల చూపంతా అహ్మదాబాద్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ పోరు మీద ఉండటంతో చాలామంది ఈ విషయం మీద పెద్ద ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ కొందరు ప్రముఖులు.. మరికొందరు మోడీ వీర భక్తులు ఒక సమాచారాన్ని అదే పనిగా పోస్టు చేయటం.. షేర్ చేయటం కనిపించింది. దాని సారాంశం ఏమంటే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు లక్షల డాలర్ల స్థాయిని అధిగిమించిందన్నదే. ఇదే విషయాన్ని పలువురు ప్రస్తావిస్తూ.. యావత్ ప్రంచం తీవ్రమైన మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న వేళ.. భారత్ మాత్రం దూసుకెళుతోందంటూ పోస్టులతో ఉదరగొట్టేశారు.
ఇలా పోస్టులు పెట్టినోళ్లు సాదాసీదా వ్యక్తులు కాదు. దేశ కుబేరుల్లో ప్రముఖుడైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు మరికొందరు సోషల్ మీడియాలో ఈ సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. అయితే.. ఇందులో నిజమెంత? అన్న విషయాన్ని చెక్ చేస్తే..అలాంటిదేమీ లేదన్న సమాధానం వస్తోంది. ఇదే సమాచారాన్ని అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ కానీ.. జాతీయ గణాంక కార్యాలయం కానీ స్పందించలేదు. దీంతో.. దీనిపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇదే విషయాన్ని మరింతగా క్రాస్ చెక్ చేయగా.. ఇందులో నిజం లేదన్న విషయం స్పష్టమైంది. మరో రెండేళ్లలో 4.4 లక్షల కోట్ల డాలర్లు ఉన్న జపాన్.. 4.3 లక్షల కోట్ల డాలర్లు ఉన్న జర్మనీ దేశాల్ని భారత్ అధిగమించి.. జీడీపీ పరంగా మూడో స్థానానికి చేరుతుందంటూ అదానీ పేర్కొన్న ట్వీట్ లో నిజం లేదని చెబుతున్నారు. ఆ మాటకు వస్తే మన దేశం 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్న మాటను చెబుతున్నారు. మరి.. ఇలాంటి విషయాల్ని గౌతమ్ అదానీ స్థాయిలో ఉన్న వారు ఎందుకు తప్పుగా పోస్టు చేయాల్సి వచ్చింది? అన్నది సమస్య. ఒకవేళ తప్పుడు పోస్టు పెట్టినా.. దానికి సంబంధించిన నిజాలు తెలిసినంతనే పోస్టును డిలీట్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.