అత్యాశ వల్లే సాఫ్ట్‌వేర్ కుటుంబం బలైందా..?
ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ఉంటేనే సమాజంలో విలువ అనేది అందరి అభిప్రాయం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ఉంటేనే సమాజంలో విలువ అనేది అందరి అభిప్రాయం. అందుకే.. నిత్యం జనాలు డబ్బు వెంటే పరుగులు పెడుతున్నారు. డబ్బు.. డబ్బు.. అంటూ గడుపుతున్నారు. దానికితోడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలనే అత్యాశతో ఏవేవో ప్రయోగాలకు పోతున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరైనా లగ్జరీగా బతకాలని కలలు కంటుంటారు. అటు ఆఫీస్ సహచరుల కన్నా.. ఇటు చుట్టుపక్కల వారి కన్నా తామే బెస్ట్ ఉండాలని అనుకుంటూ ఉంటారు. మెయింటెనెన్స్‌లోనూ ఏ మాత్రం తగ్గకూడదని గొప్పలకు పోతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి ఆలోచనల్లో చిక్కుకొని జీవితాలను ఫణంగా పెడుతున్నారు.
తాజాగా.. అలాంటి అత్యాశకు పోయి ఓ సాఫ్ట్‌వేర్ కుటుంబం చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోకాపేట్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. తెలిసిన వారి దగ్గరే కాకుండా.. లోన్ యాప్‌లలోనూ డబ్బులు తీసుకున్నాడు. వెయ్యి కాదు రెండు వేలు కాదు.. ఏకంగా రూ.25 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయాడు. అటు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి.. ఇటు పెరుగుతున్న వడ్డీలతో సతమతం అయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చనిపోయే ముందు తన తండ్రికి మెస్సేజ్ చేశాడు. ఆ మెస్సేజ్‌ను ఆయన ఆదివారం తెల్లవారుజామున 3 గంటల తరువాత చూసుకున్నారు. దాంతో అప్రమత్తమైన తండ్రి వెంటనే ఆ సాఫ్ట్‌వేర్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌కు ఫోన్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఉద్యోగి కుటుంబం మొత్తం అప్పటికే విగత జీవులయ్యారు.
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. ముందు తన ఇద్దరు పిల్లలను హతమార్చారు. ఆ తరువాత భార్యకు ఉరేసి చంపేశాడు. ఆ వెంటనే అతనూ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే వాట్సాప్ ద్వారా పలువురికి చనిపోతున్నట్లు మెస్సేజ్‌లు సైతం చేశాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో అందరూ వచ్చి చూసే సరికి కుటుంబం అంతా చనిపోయి ఉంది. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.