ఇలా రివెంజ్ తీసుకుంటే ఎలా సారూ?
చర్యకు ప్రతి చర్య సహజంగా జరిగే ప్రక్రియ. అయితే.. స్పందించాల్సినంతగా కాకుండా అంతకుమించి స్పందిస్తే నష్టమే జరుగుతోంది
చర్యకు ప్రతి చర్య సహజంగా జరిగే ప్రక్రియ. అయితే.. స్పందించాల్సినంతగా కాకుండా అంతకుమించి స్పందిస్తే నష్టమే జరుగుతోంది. రాజకీయాల్ని రాజకీయాలుగా చూసినంతవరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే దాన్నో వ్యక్తిగత అంశంగా తీసుకోవటం.. ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడటం అలవాటైందో.. అప్పటి నుంచి ప్రతీకార చర్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇలా చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నోరు తెరిస్తే నీతులు చెప్పే గులాబీ బాస్ కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు మధ్య దూరం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న వేళ.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయటం తెలిసిందే. అందులో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరు లేకపోవటం తెలిసిందే. ఆమెకు బదులుగా జాన్సన్ నాయక్ ను ఎంపిక చేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కినుకు వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె కాంగ్రెస్ తో మాట్లాడుకొని.. ఆ పార్టీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రంగం సిద్దం అవుతున్న వేళ.. ఆమె అల్లుడు శరత్ చంద్ర పవార్ పై బదిలీ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు శరత్ చంద్ర పవార్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు. ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేశారు.
ప్రస్తుతం ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా బదిలీ చేయటం చూస్తే.. ప్రాధాన్య పోస్టు నుంచి అప్రాధాన్య పోస్టులోకి మారటం స్పష్టంగా కనిపిస్తోంది. తాను టికెట్ ఇవ్వనందుకు ప్రతిగా పార్టీ మారేందుకురంగం సిద్ధం చేసుకుంటున్న రేఖా నాయక్ కు విషయాలు అర్థమయ్యేలా చేయటం కోసమే తాజా బదిలీ జరిగిందన్న మాట వినిపిస్తోంది. 2021 డిసెంబరు 26న శరత్ చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో డీజీపీ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ కు ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆకస్మిక బదిలీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా నిర్ణయాలు రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.