సెన్సెక్స్ సూపర్.. ఆల్ టైమ్ రికార్డ్.. 84 వేల మార్క్

మార్కెట్ చివరి రోజు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అదరగొట్టాయి. దీంతో సెన్సెక్స్ కొత్త శిఖరాలను తాకింది.

Update: 2024-09-20 08:05 GMT

ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు అదరగొట్టడంతో సెన్సెస్స్ సూపర్ అనేలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది.. అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లలో బుల్‌ జోరు చూపుతోంది. వారాంతంలో దుమ్మురేపింది. మార్కెట్ చివరి రోజు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అదరగొట్టాయి. దీంతో సెన్సెక్స్ కొత్త శిఖరాలను తాకింది.

తొలిసారి 84 వేలను దాటి..

సెన్సెక్స్‌ 80 వేలు దాటితేనే అద్భుతం అనుకునే దశ నుంచి శుక్రవారం చరిత్రలో మొదటిసారిగా 84వేల మార్క్‌ నూ మించేసింది. ఇక నిఫ్టీ 25,650 మార్క్‌ ను చేరింది. బ్యాంక్‌ నిఫ్టీ సైతం 53,343 మార్క్‌ వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఫార్మా మినహా అని పైన చెప్పుకొన్నప్పటికీ.. ఐటీ స్టాక్స్‌ కూడా స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, మెటల్‌ స్టాక్స్‌ రాణిస్తుంచాయి.

ఇంట్రా డే లో వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సూచీ తొలిసారి 84 వేల స్థాయిని బ్రేక్ చేసింది. దీంతో సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. శుక్రవారం ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 868 పాయింట్ల లాభంతో 84,053 వద్ద ట్రేడ్‌ అయింది. నిఫ్టీ కూడా 25,673 వద్ద సరికొత్త రికార్డును తాకింది. కాగా, సెన్సెక్స్‌ 30లో రెండు స్టాక్స్‌ మినహా అన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దంతో గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌ లో రాణించిన సూచీలు శుక్రవారమూ అదే పంథా అనుసరించాయి.

లాభాల్లో దిగ్గజ సంస్థలు

జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సెర్వ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, కోటక్ బ్యాక్ తదితర ప్రముఖ సంస్థలు శుక్రవారం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో లాభాలు కురుస్తున్నాయి. మెటల్, రియాల్టీ సూచీలు 1.73 శాతం వరకు పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా చాలా ఇతర రంగాల సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్ 0.59 శాతం లాభపడగా, మిడ్‌ క్యాప్ 0.50 శాతం ముందంజలో ఉంది. దీంతో మార్కెట్ లో జోష్ కనిపిస్తోంది.

Tags:    

Similar News