ఝులసన్ లో మళ్లీ దీపావళి... సునీతా పూర్వీకుల ఇల్లు చూశారా?

ఆమె తిరిగి క్షేమంగా రావడంతో ప్రధానంగా గుజరాత్ లో మళ్లీ దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు.;

Update: 2025-03-19 08:30 GMT

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 19 - 2025 తెల్లవారుజామున అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ప్రయాణించిన స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ ఫ్లోరిడా తీరానికి చేరుకుంది. ఆమె తిరిగి క్షేమంగా రావడంతో ప్రధానంగా గుజరాత్ లో మళ్లీ దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు.


అవును... సుమారు 9 నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరడంతో భారత్ లోని గుజరాత్ లోని ఝులసన్ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆమె క్షేమంగా తిరిగి వచ్చినప్పటి నుంచి గ్రామస్థులు మళ్లీ దీపావళి పండుగ జరుపుకుంటున్నారు.


ఈ సందర్భంగా ఆమె తిరుగు ప్రయాణాన్ని చూడటానికి గ్రామంలోని ఓ ఆలయం వద్ద టెలివిజన్ ఏర్పాటు చేశారు. దీంతో.. గ్రామం మొత్తం అక్కడ గుమిగూడింది. ఈ సమయంలో సునీత విలియమ్స్ పూరీకులది గా చెబుతోన్న ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. దీన్ని సునీత తండ్రి దీపక్ పాండ్యా పూర్వీకుల ఇల్లుగా చెబుతున్నారు.


సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా పూర్వికుల ఇల్లుగా చెబుతోన్న ఇల్లు ఇప్పటికీ ఝులసన్ వీధుల్లో ఉంది. ఎత్తైన ఈ ఇంటికి తాళం వేసి ఉండటం వల్లో ఏమో కానీ.. నిర్మాణంలో పగుళ్లు వచ్చి, గోడలు దెబ్బతిని ఉన్నాయి. దీన్ని భారత్ తో సునీతకు ఉన్న అనుబంధానికి నిదర్శనంగా చెబుతున్నారు.

సునీత విలియమ్స్ తల్లితండ్రులు 1958లో యూఎస్ కి వెళ్లడంతో ఇంటికి నిర్వహణ లోపించిందని.. అయినప్పటికీ ఇప్పటికీ అది బలంగానే ఉందని చెబుతున్నారు. సునీత విలియమ్స్ త్వరలో భారత్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతోన్న వేళ.. తన సొంత గ్రామానికి చేరుకుని, తన పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News