అమరావతికి నిధులు.. మంత్రి నారాయణ క్లారిటీ
శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి నారాయణ రాజధాని నిర్మాణానికి వేల రూ. కోట్లు అప్పుగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.;
రాజధాని అమరావతికి సేకరిస్తున్న నిధులపై మున్సిపల్ మంత్రి నారాయణ బుధవారం క్లారిటీ ఇచ్చారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి నారాయణ రాజధాని నిర్మాణానికి వేల రూ. కోట్లు అప్పుగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే కేంద్రం సిఫార్సుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంయుక్తంగా అందజేస్తున్న రూ.15 వేల కోట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు.
శాసనమండలిలో అమరావతిపై ఆసక్తికర చర్చ జరిగింది. అమరావతి కోసం సేకరిస్తున్న నిధులపై సభ్యులు ప్రశ్నించగా, మంత్రి నారాయణ సమాధానాలిచ్చారు. ప్రస్తుతానికి అమరావతి కోసం సుమారు రూ.31 వేల కోట్లు సమీకరించినట్లు మంత్రి వివరించారు. ప్రపంచబ్యాంకు రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ అనే జర్మన్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు అప్పుగా తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు పన్నులుగా చెల్లించిన డబ్బును రాజధాని అమరావతి కోసం వినియోగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని చెప్పారు.
అప్పుగా తీసుకున్న రూ.31 వేల కోట్లు విడుదలలో కొంత జాప్యం జరుగుతుండటం వల్ల రాజధాని పనుల కోసం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు సర్దుబాటు చేశామని తెలిపారు. రుణ మొత్తం విడుదలయ్యాక ఈ మొత్తం తిరిగి బడ్జెట్ కు జమ చేస్తామని వివరించారు. ఇక రాజధాని అమరావతిలో నిర్మించనున్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రమే వంద శాతం ఖర్చు చేయనుందని వెల్లడించారు. అమరావతిని డిజైన్ చేసినప్పుడే స్వయం సమృద్ధి మోడల్ లో తీర్చిదిద్దామన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడి భూముల నుంచి రీపేమెంట్ చేస్తామని వెల్లడించారు.