వివేకా కేసులో మరో ట్విస్టు : ప్రాణహాని అంటూ నిందితుడు ఫిర్యాదు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది.;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిశారు. తన సహ నిందితులతోనే తనకు ముప్పు పొంచివుందని ఆయన ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఇప్పటి ఈ కేసులో ఆరుగురు సాక్ష్యులు మరణించారు. నిందితుల్లో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. ఇప్పుడు నిందితులు కూడా ప్రాణహానిపై ఆందోళన వ్యక్తం చేయడంతో అసలేం జరుగుతుందనేది చర్చనీయాంశమవుతోంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగి ఆరేళ్లు అయినా కేసు విచారణ మొదలు కాలేదని హతుడి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఒక వైపు న్యాయపోరాటం చేస్తుండగా, మరోవైపు కీలక సాక్ష్యులు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పుడు సాక్ష్యులే కాకుండా హత్య కేసులో నిందితులు కూడా తమ ప్రాణాలకు ముప్పు ఉందని, సహ నిందితులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది.
వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తాజాగా కడప ఎస్పీని కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులు జైల్లో తనను బెదిరించినట్లు ఆరోపించాడు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని, వైసీపీకి చెందిన కొందరు నేతలు కూడా బెదిరిస్తున్నారని ఏకరువు పెట్టాడు. ‘హత్య’లో తన క్యారెక్టర్ ను క్రూరంగా చూపారని, నిందితులు 8 మందిని ఎందుకు చూపలేదని ప్రశ్నించారు.
ఇక సునీల్ నాయక్ ఫిర్యాదుతో వివేకా హత్య కేసు చాలెంజింగ్ గా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ కోర్టులో చార్జిషీటు వేయాల్సివుంది. మరోవైపు తాజా ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోలీసు విచారణకు ఆదేశించింది. గత ఐదేళ్లలో ఎన్నో మలుపులు తిరిగిన వివేకా హత్య కేసుకు ఇప్పటికైనా ముగింపు ఉంటుందా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొండటం వల్ల రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.