సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైంది...కూటమికి బిగ్ అలెర్ట్ !

మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడం వెనక పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఎన్నో కీలకంగా పనిచేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి.;

Update: 2025-03-28 23:30 GMT
సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైంది...కూటమికి బిగ్ అలెర్ట్ !

ఏపీలో టీడీపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ సీట్లను 21 ఎంపీ సీట్లను గెలిచుకుంది. దాదాపుగా అరవై శాతం ఓటు షేర్ ని కొల్లగొట్టింది. మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడం వెనక పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఎన్నో కీలకంగా పనిచేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

అప్పటికి అయిదేళ్ళుగా పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఒక ఎత్తు అయితే అదే సమయంలో మూడు ప్రధాన పార్టీలు కూటమి కట్టడం మరో ఎత్తు. వీటికి తోడు అన్నట్లుగా సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి. వాటి మీద మోజుతో ఓటు వేసిన జనాలు కూడా గణనీయంగా ఉండడంతో కూటమి ఓటు షేర్ అరవై దాకా పాకింది అని చెబుతారు.

వైసీపీ మీద పట్టణ ప్రాంతాలలో భారీగా వ్యతిరేకత ఉన్నా పల్లెలలో అయితే సందిగ్ద పరిస్థితి ఉంది. వారికి పధకాలు ఏమైపోతాయన్న ఆలోచన ఉండేది. దానికి సరైన క్లారిటీ ఇస్తూ వైసీపీ కంటే రెట్టింపు ఇస్తామని కూటమి పెద్దలు చెప్పడంతో పూర్తి స్థాయిలో వారు కూడా ఇటు వైపు మొగ్గు చూపారని అంటారు.

ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏప్రిల్ 12 నాటికి పది నెలలు నిండుతాయి. సూపర్ సిక్స్ లో ఒక్క పెన్షన్ పధకం తప్ప మిగిలినవి అయితే పెద్దగా అమలుకు నోచుకోలేదన్న బాధ జనాల్లో ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతీ నెలకూ ఏదో ఒక పధకాన్ని అమలు చేస్తూ జనాల చేతిలో డబ్బు ఉంచేది. దాంతో పల్లెలలో డబ్బు ఆడుతూ వచ్చేది.

అది మార్కెట్ ఎకానమీని ప్రభావితం చేసేది అందుకే జీఎస్టీ కూడా బాగా కనిపించేది. అయితే ఇపుడు చూస్తే అలాంటిది ఏదీ లేకపోవడంలో పల్లెలలో ఒక రకమైన అసంతృప్తి బయల్దేరింది అని అంటున్నారు. పల్లె జనాలు అయితే పధకాలు ఏమీ రావడం లేదన్న ఆవేదనతో ఉన్నారు.

సరిగ్గా ఈ అసంతృప్తినే ఒక సర్వే గట్టిగానే పట్టుకుంది. ఆ సర్వే చేసిన సంస్థకు మంచి విశ్వసనీయత ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏణ్ణర్థం ముందే టీడీపీ కూటమి కడితే కచ్చితంగా అధికారంలోకి వస్తుందని సదరు సర్వే వ్యక్తులు చెప్పి ఉన్నారు.

ఇపుడు ఆ సర్వే నిపుణుడే పల్లెలలో సూపర్ సిక్స్ పధకాలు అమలు కావడం లేదని అసంతృప్తి పెద్ద ఎత్తున ఉందని చెబుతున్నారు. ఈ మేరకు సర్వే నిపుణుడు తాజాగా వేసిన ట్వీట్ ఒకటి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆ ట్వీట్ లో ఆయన పల్లెల్లో సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైంది ఏఐ సంగతేమో కానీ గ్రామాల్లో మనీ రొటేషన్ జరగట్లేదు అంటూ పెట్టిన ఒకే ఒక ట్వీట్ అయితే కూటమి కి బిగ్ అలెర్ట్ గా మారింది.

అంటే జాగ్రత్త పడాలని సూచనా ప్రాయంగానే ఇలా ట్వీట్ పెట్టారని భావిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను తుచ తప్పకుండా హామీ చేస్తేనే తప్ప జనాలు శాంతించరు అన్న సందేశం అంతర్లీనంగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు గతంలో ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇపుడు ఏఐ అని అంటున్నారు. అంతే కాదు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అని భారీ విజన్ తో కూడిన యాక్షన్ ప్లాన్ ని ముందుకు తెస్తున్నారు. సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి చేయడం కష్టం. నిధుల కొరత ఉంది. దాంతో అభివృద్ధి మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు బాబు అమరావతి రాజధాని కోసం చూపిస్తున్న శ్రద్ధ కానీ పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్న తీరు కానీ అర్బన్ ఓటర్లకు బాగా నచ్చుతున్నాయి.

అదే సమయంలో పల్లె జనాలు మాత్రం పధకాల విషయంలో బెంగటిల్లుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో 125 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు పల్లె పట్టులలోనే ఉన్నాయి. దాంతో కూటమి పల్లె జనాల అసంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది అని అంటున్నారు. అప్పులు బాగా గత ప్రభుత్వం చేసింది. ఖజానా ఖాళీ అని ఎన్ని చెప్పినా జనాలకు అవి పట్టవు అనే అంటున్నారు. దాంతో కూటమి ఆరు నూరు అయినా సూపర్ సిక్స్ ని ఎన్నికల్లో చెప్పిన మేరకు అమలు చేసి తీరాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News