నోటీ దూల.. టికెట్ ఫట్!
కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి, భారత్ జోడో యాత్రపై పుస్తకం కూడా రాసిన సుప్రియా శ్రీనేత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒకవైపు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు రావడం లేదు మొర్రో.. అని నాయకులు ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. మరోవైపు.. కొందరు నాయకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి టికెట్ వచ్చిన వారు వాటిని నిలబెట్టుకుంటున్నారా? అంటే.. కొందరు మాత్రం నోటి దూలతో పాడు చేసుకుంటున్నారనే చెప్పాలి. ఇటీ వల నోరు పారసుకుని.. బీజేపీ నేతను ''వేశ్య'' అనిసంబోధించిన కాంగ్రెస్ నాయకురాలికి పార్టీ ఇప్పుడు టికెట్ కట్ చేసింది. దీంతో సదరు నేత లబోదిబోమంటున్నారు.
ఏం జరిగింది?
బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరారు. ఆ వెంటనే ఆమెకు హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి' లోక్ సభ సీటు ఇచ్చారు. దీంతో ఆమె పోటీకి రెడీ అయ్యారు. ఇంతలో ఈ టికెట్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి, భారత్ జోడో యాత్రపై పుస్తకం కూడా రాసిన సుప్రియా శ్రీనేత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో ''వేశ్యలకు కూడా టికెట్ ఇచ్చారు'' అని సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. అంతేకాదు.. కంగన అభ్యంతరకర రీతిలో(ఓ సినిమా) బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఇది రాజకీయ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. శ్రీనతేను వివరణ కూడా కోరకుండానే ఆమెను లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును పార్టీ ప్రకటించింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి సుప్రియ శ్రీనతే పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మరోసారి పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చింది. కానీ, 'వేశ్య' వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీనతేను ఆ స్థానం నుంచి తప్పించి.. వీరేంద్ర చౌదరి పేరును కాంగ్రెస్ ప్రకటించింది.
ఇదిలావుంటే.. మరోవైపు 'వేశ్య' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని, ఇది సబబు కాదని హెచ్చరించింది. కాగా, ఆమె ఇచ్చే వివరణను బట్టి కేసు నమోదు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.