వర్మను ముంచేస్తున్న అనుచరగణం!
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానంలో అయినా పోటీ చేయాలని అనుకున్నారు.;
టీడీపీ నాయకుడు.. ఎస్‌వీఎస్ వర్మ.. ఉరఫ్ పిఠాపురం వర్మగా పేరు తెచ్చుకున్న ఆయన పదవి కోసం వేచి చూస్తున్న విష యం తెలిసిందే. గత ఎన్నికల్లో టికెట్‌ను త్యాగం చేసిన ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. దాదాపు ఏడాది పూర్తవుతున్నా.. ఆయనకు అవకాశం చిక్కలేదు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒక్కటైనా తనకు దక్కుతుందని వర్మ భావించారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానంలో అయినా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక, తాజాగా మూడోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేస్తున్నా.. వర్మకు అవకాశం దక్కలేదు. ఆదివారం మధ్యా హ్నం వరకు వర్మ తన అనుచరులతో వేచి చూశారు. తనకు ఈ దఫా టికెట్ ఖాయమని అనుకున్నారు. కానీ, పార్టీ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని ఆయన వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా వర్మకు ఫోన్ చేసినా.. ఆయన స్విచ్ ఆఫ్‌లో ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఇలా ఎందుకు జరుగుతోంది? అనేది ప్రశ్న. దీనికి రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న నాయకుడిగా వర్మకు మంచి పేరుంది. ఇది మంచిదే అయినా.. ఈ క్రమంలో ఆయన రెండో అధికార కేంద్రం అవుతారన్న చర్చ సాగుతోంది. పిఠాపరంలో ఇప్పటికే జనసేన-టీడీపీ వర్గాల మధ్య అంతర్గత రగడలు కొనసాగుతున్నా యి. పైస్థాయిలో నాయకులు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పిఠాపురంలో మాత్రం వర్మ అనుచరగణానికి జనసేన వర్గానికి మధ్య వివాదాలు నిత్యం సాగుతూనే ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో వర్మ విఫలమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయనకు పదవి ఇస్తే.. ఇక్కడ అంటే.. పిఠాపురంలో రెండో అధికార కేంద్రం క్రియేట్ అయినట్టేనన్న భావన ఉంది.
మరోవైపు.. గత ఏడాది ఎన్నికలకు ముందు టికెట్ రాదని తెలిసిన తర్వాత.. పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను తగలబెట్టారు. దీనికి వర్మకు అత్యంత సన్నిహితుడే ముందుండి ప్లాన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకుని సదరు సన్నిహితుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ, వర్మ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం కూడా.. ఆయనకు పార్టీలో మైనస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు వేచి చూసే ధోరణిలో ఉన్నారని.. ఇప్పటికిప్పుడు పదవి ఇస్తే.. పిఠాపురంలో జనసేన-టీడీపీ వర్గాల మధ్య మరింత వివాదం చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇవే కారణాలా? ఇంకా ఏవైనా ఉన్నాయా? అనే చర్చ కూడా ఉండడం గమనార్హం.