చంద్రబాబుపై స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు... తెరపైకి ప్లేటు ఫిరాయింపు?

తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన స్వరూపానంద సరస్వతి... అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని మొదలుపెట్టారు.

Update: 2024-06-10 07:39 GMT

ఏపీలో ప్రజలు మారారు.. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు పెరిగాయి.. ప్రభుత్వం మారింది.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.. ఈ సమయంలో శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కూడా మారినట్లున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.

అవును... గతంలో చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, వైఎస్ జగన్ మరో ముఫ్ఫై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించిన స్వరూపనంద తాజాగా ప్లేట్ ఫిరాయించినట్లున్నారు! ఇందులో భాగంగా ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన స్వరూపానంద సరస్వతి... అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని మొదలుపెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు - పవన్ - బీజేపీ కూటమి అధికారంలొకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఇదే సమయంలో... అమ్మవారి కృపతో నరేంద్రమోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని తెలిపారు. ఇక, బుధవారం ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండటంతో ఆంధ్రరాష్ట్రం బాగుండాలని తాము కూడా యాగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నది అద్భుతమైన ముహూర్తమని.. సింహ లగ్నమని తెలిపారు. ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయాలని ఆశీర్వదిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తనకు అత్యంత ఆత్మీయుడు ఆయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

అదేవిధంగా... తాను చంద్రబాబుని కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దని.. తన వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసని చెప్పిన స్వరూపానంద... చంద్రబాబు గెలవాలని గతంలో మురళీమోహన్‌ తో సాధువులందరితో కలిసి సమావేశం పెట్టి పూజలు చేశామని.. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదని అన్నారు. చంద్రబాబు అంటే చాలా గౌరవం అని.. ఆయన చాలా సీనియర్ నేత అని.. ఆయన ఆరోగ్యం బావుండాలని అన్నారు.

ఏది ఏమైనా... కారణం మరేదైనా... ఉన్నపలంగా స్వరూపానంద ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... అమరావతిలో భూములు కాపాడుకునే ప్రయత్నంలో భాగమేమో అని అంటుండటం గమనార్హం.

Tags:    

Similar News