తెలంగాణలో కీలక పరిణామం.. సీఎంను కలిసి మాజీమంత్రి
బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, కీలక నేత ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, కీలక నేత ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు.. ఆ నేత సీఎంతో కలవడంపై ఉత్కంఠ సైతం కనిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సన్నిహితులు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. దీంతో అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇదే టాపిక్‌పై చర్చ కొనసాగింది. గ్రేటర్ నుంచి ఎవరు అధికార పార్టీలోకి చేరబోతున్నారా అని అటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే.. పీసీసీ చీఫ్ ప్రకటించి కూడా నెల రోజులు కావస్తున్నా ఇంతవరకైతే ఎలాంటి చేరికలు జరగలేదు. కానీ.. తప్పకుండా చేరికలు ఉంటాయని ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ సైతం అలర్ట్ అవుతూ వస్తోంది. మరోవైపు.. ఇటీవలే ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. ఆ తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చింది. దాంతో బీఆర్ఎస్ నుంచి చేరికలు పెరుగుతాయని అందరూ భావించారు. పీసీసీ చీఫ్ సైతం హైకోర్టు తీర్పును అనుసరించే ఆ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుతో ఎవరైనా వచ్చి పార్టీలో చేరేందుకు మార్గం సైతం సుగమమైంది.
గ్రేటర్‌లో ప్రధానంగా గత ప్రభుత్వం కేబినెట్ మంత్రులుగా వ్యవహరించిన వారు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీమంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం అయినట్లుగానూ సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరారు.
ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం చర్చకు దారితీసింది. అయితే.. వేరే కారణంతో ఆయన సీఎంను కలవడంతో బీఆర్ఎస్ కేడర్ అంతా ఊపిరిపీల్చుకుంది. రేవంత్ నివాసానికి వచ్చిన తలసాని తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం సీఎంతో షేక్ హ్యాండ్ కలిపారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన మనవరాలి పెళ్లికి సీఎంను ఇన్వైట్ చేశారు. అయితే... ముందు నుంచి కూడా ఈ ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తుండడం. తాజాగా తలసాని రేవంత్‌ను కలవడంతో పార్టీ మార్పుపై ఏమైనా చర్చలు జరిగాయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.