ఊరిస్తున్న 5ఐపీవోలు.. మీరు పెట్టేది ఎందులో?

అప్పుడప్పుడు ఐపీవోలు వస్తుంటాయి.. పోతుంటాయి. దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు

Update: 2023-11-20 04:50 GMT

అప్పుడప్పుడు ఐపీవోలు వస్తుంటాయి.. పోతుంటాయి. దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ.. కొన్ని కంపెనీలు ఐపీవోలు మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతుంటాయి. వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున ఆసక్తిని వ్యక్తం చేస్తుంటారు. ఈ వారం అలాంటి ఆసక్తే వ్యక్తమయ్యే ఐపీవో ఒకటి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఆ ఐపీవో ఎవరిదో కాదు.. యావత్ దేశం అత్యంత నమ్మకమైన కంపెనీగా ఫీల్ అయ్యే టాటా సంస్థకు చెందిన ఐపీవో అందరిని ఆకర్షిస్తోంది.

2023-24 తొలి అర్థ భాగంలో దేశీయ ఐపీవో విపణిలో మొత్తం 31 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. రూ.26,00 కోట్ల నిధుల్ని ఆయా కంపెనీలు సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలంలో 14 కంపెనీలు ఐపీవో ద్వారా రూ.35,450 కోట్లు సేకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 26 శాతం ఐపీవోలు తగ్గటం గమనార్హం.

అందరినోట నానుతున్న టాటా టెక్సాలజీస్ విషయానికి వస్తే.. అప్పుడెప్పుడో 2004లో అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత టాటా సంస్థ నుంచి ఐపీవో ఒకటి ఈ వారం ముందుకు రానుంది. టీసీఎస్ ఐపీవో తర్వాత మళ్లీ ఐపీవోకు టాటా నుంచి వస్తున్నది ఇదే. దీంతో.. విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. టాటా టెక్నాలజీస్ పేరుతో వస్తున్న ఈ ఐపీవో మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండే ఈ ఐపీవో ద్వారా రూ.3042 కోట్ల విలువైన నిధుల్ని కంపెనీ సమీకరించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా 6.08 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. టాటా మోటార్స్.. అల్ఫా టీసీ హోల్డింగ్స్.. టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1 ద్వారా విక్రయించనున్నారు. ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.475 నుంచి రూ500 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఎవరైనా ఈ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం 30 షేర్లకు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే.. కనీస పెట్టుబడి రూ.15వేల వరకు ఉండనుంది. ఈ ఐపీవో ఈ నెల 22-24 తేదీల్లో జరగనుంది.

టాటా టెక్నాలజీస్ తో పాటు మిగిలిన నాలుగు ఐపీవోల విషయానికి వస్తే.. ఇండియన్ రెన్యూవబుల్ ఎనరజీ డెవలప్ మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ).. ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్.. గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియాలు ఉన్నాయి. ఇందులో ఒక్క ఐఆర్ఈడీఏ ఇష్యూ మాత్రం 21-23 తేదీల్లో కాగా.. మిగిలిన ఇష్యూలు ఈ నెల 22-24 తేదీల్లో జరగనున్నాయి.

ఐఆర్ఈడీఏ ఐపీవో విషయానికి వస్తే.. ఇష్యూ ధరల శ్రేణి రూ.30నుంచి రూ.32 వరకు ఉంటుంది. ఈ షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.2150 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయానికి వస్తే.. ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ఈ సంస్థ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.600 కోట్లు.. ఓఎఫ్ఎస్ విధానంలో రూ.492 కోట్లు కలిపి మొత్తంగా రూ.1092 కోట్లుసమీకరించాలని భావిస్తోంది. దీని ధరల శ్రేణి రూ.133- 140 మధ్యన ఉంటుందని చెబుతున్నారు.

ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే.. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.292 కోట్లు.. ఓఎఫ్ఎస్ షేర్ల విక్రయం ద్వారా రూ.301 కోట్లు సమీకరించాలని భావిస్తున్నారు. దీని ధరల శ్రేణి రూ.288-304గా చెబుతున్నారు. గాంధార్ ఆయిల్ రిఫైనరీ విసయానికి వస్తే.. 1.79 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.302 కోట్లు.. ఓఎఫ్ఎస్ లో 1.18 కోట్ల షేర్ల విక్రయం ద్వారారూ.198.69 కోట్ల మొత్తాన్ని సమీకరించనుంది. దీని ధరల శ్రేణి రూ.160-169గా చెబుతున్నారు.

Tags:    

Similar News