సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి త్రుటిలో తప్పించుకున్న టీడీజీపీ

ఆయన తన అనుభవాన్ని చెప్పటం ద్వారా.. మిగిలిన వారు అలాంటి ట్రాప్ లోకి అస్సలు పడొద్దన్నది ఆయన ఉద్దేశం.

Update: 2024-02-03 11:30 GMT

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి తాజాగా తెలంగాణ పోలీస్ బాస్ రవిగుప్తా త్రుటిలో తప్పించుకున్న ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వీడియోలు చూసి లైకులు కొడితే డబ్బులు వస్తాయంటే..ఓసారి ఎయిర్ పోర్టులో తాను ఆ పని చేశానని.. అయితే త్రుటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. ఆయన తన అనుభవాన్ని చెప్పటం ద్వారా.. మిగిలిన వారు అలాంటి ట్రాప్ లోకి అస్సలు పడొద్దన్నది ఆయన ఉద్దేశం. సైబర్ కేటుగాళ్లు ఎంత తెలివిగా దెబ్బ తీస్తారన్న దానికి తన అనుభవాన్ని ఆయన వెల్లడించారు.

‘‘ఒకసారి ఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు వీడియో చూసి.. లైక్ కొడితే డబ్బులు వస్తాయని ఆశ చూపారు. అలానే లైక్ కొట్టా. సైబర్ నేరగాళ్లు నన్ను ప్రలోభ పెట్టేందుకు బ్యాంకు వివరాలు తీసుకొని ముందుగా రూ.150 ఇచ్చారు. అయితే.. నాకు రెండు బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఒకదాన్లో అస్సలు డబ్బులు ఉండవు. ఇంకొక దాన్లో డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉండని ఖాతా వివరాల్ని ఇచ్చా. ఆ ఖాతాలో డబ్బులు ఏమీ లేకపోవటంతో వదిలేశారు’’ అంటూ తన అనుభవాన్ని వెల్లడించారు.

అప్రమత్తత.. ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడే వీలుందని పేర్కొన్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఒకరు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని.. నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును ఫ్రీజ్ చేయటం.. బాధితులకు డబ్బులు తిరిగి అప్పగించటం ద్వారా దేశంలో తెలంగాణ మొదటి స్థానం లో ఉంటుందని వివరించారు. సో.. డబ్బులు ఊరికే రావన్న మాటను మర్చిపోకూడదు.


Tags:    

Similar News