2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారేమో?: చంద్రబాబు

భీమవరం నియోజకవర్గంలోని తాడేరు దగ్గర యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-09-06 12:44 GMT

భీమవరం నియోజకవర్గంలోని తాడేరు దగ్గర యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ రాళ్ల దాడిలో టిడిపికి చెందిన వాహనాలు ధ్వంసం గాక పలువురికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా అర్ధరాత్రి యువగళం సైట్ క్యాంప్ వద్దకు వెళ్లిన పోలీసులు కొందరు యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకొని చుట్టుపక్కల స్టేషన్లకు తిప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యలోనే ఈ ఘటనను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.

యువగళం పాదయాత్ర దగ్గరకు వైసీపీ శ్రేణులు వెళ్లి టిడిపి శ్రేణులపై దాడులు చేస్తారని, మళ్ళీ తిరిగి టిడిపి కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిపైన కేసులు పెడుతుంటారని మండిపడ్డారు. నిప్పులా బతికిన తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు మండిపడ్డారు. ఒకటి రెండు రోజుల్లో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కూడా దాడి చేసే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏం జరిగినా, ఎన్ని చేసినా ప్రజల కోసం పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఈ అరాచక పాలన ఎంతో కాలం సాగదని, ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వం డబ్బులు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మన వేలుతో మన కన్ను పొడిచే పరిస్థితికి వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మామూలు సైకో కాదని కరుడుగట్టిన సైకో అని దుయ్యబట్టారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికి ఒకరు తనతో పాటు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహాభారతం, రామాయణంలో అంతిమ విజయం ధర్మానిదేనని, అదే రీతిలో టిడిపి కూడా గెలుస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ రాని విధంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News