ఆ పార్టీ గుర్తు మరీ పాతదైంది బాసూ..?
ఈ నేపథ్యంలో టీడీపీ గుర్తు మరీ పాతదై పోయిందా..? ఒకనాటి సామాన్యుడి గుర్తు నేడు ఓ అవసరార్థమైనదిగా మాత్రమే మిగిలిందా? అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది
దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే గుర్తులు ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తమ విధానాలను ప్రతిబింబించేలా గుర్తులు ఉంటే ఆయా పార్టీలు సంతోషిస్తాయి. కొన్నిసార్లు ఎన్నికల సంఘం సూచించిన గుర్తులనే తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు చేసేదేం లేదు. కాగా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 40 ఏళ్ల కిందట జరిగిన కీలక పరిణామం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం. ఉమ్మడి ఏపీలో దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు కేవలం 9 నెలల్లో తెరదించారు అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).
నాడు సామాన్యుడి వాహనం..
1980ల్లో టీడీపీ ఆవిర్భావం పెను సంచలనం. అప్పట్లో పార్టీకి వచ్చిన గుర్తు కూడా సామాన్య ప్రజలను టీడీపీ పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది. నాటి పరిస్థితుల్లో కాస్త డబ్బున్నవారు మాత్రమే కొనగలిగిన వాహనం 'సైకిల్'. ఒక విధంగా చెప్పాలంటే నాడు చాలామందికి ఈ మాత్రం రవాణా సాధనం కూడా లేదు. చాలావరకు ప్రజా రవాణానే ఆశ్రయించేవారు. సామాన్యులు ఎక్కువగా సైకిల్ నే వాడేవారు. ఇదే గుర్తు టీడీపీకి రావడంతో అత్యధిక శాతం ప్రజలంతా ఆ పార్టీని తమదిగా భావించి ఓట్లు వేశారు. అఖండ మెజార్టీతో గెలిపించారు.
నాడు అవసరార్థమే..
కాలం మారింది.. ఎంతో వేగంగా ముందుకెళ్తోంది. ఇలాంటి సమయలో ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయి. ఒకప్పుడు సైకిల్ ఉంటే గొప్ప అనుకునేవారు నేడు కనీసం కారు ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గుర్తు మరీ పాతదై పోయిందా..? ఒకనాటి సామాన్యుడి గుర్తు నేడు ఓ అవసరార్థమైనదిగా మాత్రమే మిగిలిందా? అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.
యూపీలో ఆ పార్టీకి..
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ఉత్తరాదిన సమాజ్ వాదీ పార్టీకి దక్కింది. టీడీపీ తర్వాత దాదాపు పదేళ్లకు ఈ పార్టీని స్థాపించారు ములాయం సింగ్ యాదవ్. విచిత్రం ఏమంటే యూపీలో సమాజ్ వాదీ పార్టీ గత రెండు ఎన్నికల్లో పరాజయం పాలైంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఉనికి కోసం పోరాడుతోంది.
కొసమెరుపు: టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రేరణగా రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు దశాబ్దాలు ఆ పార్టీలో కొనసాగారు. 2001లో సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తదుపరి బీఆర్ఎస్) అంటూ పార్టీని స్థాపించుకున్నారు. ''కారు'' గుర్తును పొందారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్టీఆర్ శిష్యుడి పార్టీకి ఎన్నికల గుర్తు దక్కడం గమనార్హం.