టీడీపీ ఉగాది పంచాంగం... చంద్రబాబుకు మామూలుగా ఉండదంట!
ఈ క్రమంలోనే ఉగాదిని పురష్కరించుకుని టీడీపీ కార్యాలయంలో కూడా పంచాంగ పఠనం నిర్వహించారు.
తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉదయం పచ్చడి తినడం ఎంత ముఖ్యమో.. పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యమనేది తెలిసిన విషయమే. ఈ ఏడాది అంతా ఎదురయ్యే కష్టసుఖాలు, సుఖఃదుఖాలు, చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన విషయాల గురించి ఆ పంచాంగ శ్రవణంలో చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఉగాదిని పురష్కరించుకుని టీడీపీ కార్యాలయంలో కూడా పంచాంగ పఠనం నిర్వహించారు.
ఉగాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పంచాంగ పఠనకర్త.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగుండదని చెప్పుకొచ్చారు.
అవును... ప్రముఖ ప్రవచన కర్త, చిర్రావూరి పంచాంగాన్ని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పఠించి వినిపించారు. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 128 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు! ఇదే క్రమంలో.. లోక్ సభ ఫలితాలపైనా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో... 25 ఎంపీ స్థానాలకు గానూ ఒక్కటి మాత్రమే ఓడిపోయి.. 24 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని తెలిపారు!
అంటే... 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన లోక్ సభ స్థానాలకంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉందన్నమాట. కాకపోతే అసెంబ్లీ సీట్లు మాత్రం గతంలో వైసీపీకి వచ్చిన 151 కంటే కాస్త తగ్గి 128 వరకూ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు! అంటే... ఏపీలో ఈ ఏడాది అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వం కాగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయేది చంద్రబాబు అని చిర్రావూరి వివరించారన్నమాట!
ఇదే సమయంలో... క్రోధి నామ సంవత్సరంలో చంద్రబాబుకు రాజయోగం పడుతోందని.. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా, ప్రజల మన్ననలు కూడా లభిస్తున్నాయని చిర్రావూరి తెలిపారు. ఇదే క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. దీంతో... ఈ పంచాంగం విని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయని తెలుస్తుంది.
కాగా... సహజంగా పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీకి అనువైన మాటలు చెబుతారని.. అలా అని వారిని తప్పుబట్టలేమని చెబుతూ అందుకు పలు ఉదాహరణలు చూపిస్తుంటున్నారు పరిశీలకులు! ఏది ఏమైనా... ఈ పంచాంగం మాత్రం పండగ పూట టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందనే చెప్పాలి!!