మోదీతో భేటీ.. ముంబైలో 2 గంటల ర్యాలీ.. టీమిండియా వరల్డ్ కప్ విజయోత్సాహం
భారత జట్టుకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు గురువారం తెల్లవారుజామునే పెద్దఎత్తున ఎయిర్ పోర్ట్ కు చేరారు. దీంతో భద్రతా సిబ్బందిని మోహరించారు.
11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ.. 13 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్.. 17 ఏళ్ల అనంతరం టి20 వరల్డ్ కప్ విజేత.. దీంతో భారత జట్టు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. శనివారం ప్రపంచ కప్ గెలిచాక.. మహా అయితే ఆదివారం సాయంత్రానికి భారత్ కు చేరుకోవాల్సిన జట్టు తుఫాను కారణంగా చిక్కుకుపోయింది. వేచి చూస్తే విజయం విలువ మరింత పెరుగుతుందన్నట్లుగా.. గురువారం ఉదయం జట్టు సభ్యులందరూ ఉన్న ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అవడం ఆలస్యం.. అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, కెప్టెన్ రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. దీని తర్వాత ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రపంచ కప్ తో రోడ్ షో చేపట్టనున్నారు. రెండు గంటల పాటు సాగే ఈ ఊరేగింపులో రోహిత్ బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగనుంది. ఈ రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టును సన్మానించనున్నారు.
తెల్లవారుజామునే విమానాశ్రయానికి..
భారత జట్టుకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు గురువారం తెల్లవారుజామునే పెద్దఎత్తున ఎయిర్ పోర్ట్ కు చేరారు. దీంతో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలో ఓవైపు జోరు వర్షం పడుతోంది. అయినా వందలాది అభిమానులు ప్లకార్డులతో టీమిండియాను స్వాగతించారు. తెల్లవారుజామున 4:30కే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు ఓ అభిమాని చెప్పాడు. కొందరైతే బుధవారం రాత్రి నుంచే వేచి చూస్తున్నట్లు తెలిపారు.
అప్పట్లోనూ ముంబైలోనే..
టీమిండియా 2007లో టి20 ప్రపంచ కప్ గెలిచాక, 2008లో అండర్ 19 ప్రపంచ కప్ కొట్టాక ముంబైలోనే రోడ్ షో నిర్వహించింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉండడంతో ముంబైలోనే రోడ్ షో ఏర్పాటు చేస్తుంటారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ ముంబైలోనే జరిగింది. ఇక ప్రపంచ కప్ తో ప్రస్తుతం మన జట్టు ఏయే నగరాల్లో విజయ యాత్ర చేస్తుందో చూడాల్సి ఉంది. కాగా, శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ ముగిశాక బయల్దేరాల్సిన భారత జట్టు.. భీకర తుఫాను బార్బడోస్ లోనే ఆగిపోయింది.
బీసీసీఐ ప్రత్యేక విమానంలో..
బార్బడోస్ నుంచి టీమిండియా వచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం జట్టు సభ్యలు బయల్దేరారు. కాగా, అభిమానుల సందడి మధ్య ఆటగాళ్లు ఎయిర్ పోర్టు నుంచి బయటకు నవ్వుతూ వచ్చారు. ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పిన సూర్యకుమార్ యాదవ్ అయితే, తనదైన శైలిలో ఉత్సాహంగా స్పందించాడు. వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అభిమానులకు సెల్యూట్ చేశాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ గాల్లోకి ముద్దులు ఇచ్చాడు. ఆఖరికి కెప్టెన్ రోహిత్ చేతిలో ఉన్న ప్రపంచ కప్ ను అభిమానులకు చూపుతూ బస్సు ఎక్కాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభివాదం చేస్తూ కదిలాడు.