కొత్త సంవత్సరం కొత్త దనం ఇది తెలంగాణ బీజేపీ ప్రత్యేకం

ఎప్పుడైనా టీడీపీ కార్యక్రమాలు జరిగితే ఎన్టీఆర్ భవన్ నుంచి చంద్రబాబు ఇల్లు ఉండే జూబ్లీహిల్స్ మార్గంలోనే చంద్రబాబు ప్లెక్సీలు కనిపించేవి.

Update: 2024-12-31 11:06 GMT

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లు ఏపీ నాయకుల ఫొటోలను తమ ఫ్లెక్సీల్లో ముద్రించి తెలంగాణ కమలనాథులు కొత్త చర్చకు తెరలేపారు. ఎన్డీఏ కూటమి నేతలైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఫొటోలు బీజేపీ ప్లెక్సీల్లో కనిపించడంతో విస్తృత చర్చకు దారితీసింది.

 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు, ప్లెక్సీలు పెద్దగా హైదరాబాద్లో కనిపించేవి కావు. ఎప్పుడైనా టీడీపీ కార్యక్రమాలు జరిగితే ఎన్టీఆర్ భవన్ నుంచి చంద్రబాబు ఇల్లు ఉండే జూబ్లీహిల్స్ మార్గంలోనే చంద్రబాబు ప్లెక్సీలు కనిపించేవి. కానీ, ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ నగరమంతా చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలతో కూడిన ప్లెక్సీలను బీజేపీ ఏర్పాటు చేయడం విశేషంగా చెబుతున్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి పార్టీలైనా ఈ మూడు పార్టీల రాజకీయం కేవలం ఏపీకే పరిమితయ్యేది. తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఆ పార్టీ వెనక్కి తగ్గేది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలే సాధించినా, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఇరుపార్టీలు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఈ కూటమిలో టీడీపీ చేరినా 2024 ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబు అడుగు పెట్టలేదు.

ఎన్నికల అనంతరం చంద్రబాబు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ కూటమిలో బీజేపీ, జనసేన భాగస్వాములుగా ఉండటంతోపాటు జనసేనాని పవన్ మరింత కీలక భూమిక పోషించడంతో ఆయన ప్రాధాన్యం బాగా పెరిగింది. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు చాలా అవసరమైంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటున్న బీజేపీ.. తెలంగాణలో ఆయన ఫొటోలతో ప్లెక్సీలను ఏర్పాటు చేయించింది.

తెలంగాణలో బీజీపీ ప్లెక్సీల్లో ఆంధ్రా నేతలైన చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలతోపాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఫొటోలు వేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్లెక్సీల్లో మిగిలిన ఏపీ బీజేపీ నేతల ఫొటోలు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఫొటోలు వేయడం ప్రొటోకాల్ అని భావించినా, ఈ ప్లెక్సీల్లో యువనేత లోకేశ్ ఫొటో కూడా వేయడంతో బీజేపీ టీడీపీ యువనేతకు ప్రాధాన్యమిస్తోందనే సంకేతాలిచ్చినట్టుగా భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News