కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు ఆణిముత్యాలేనా?

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ దెబ్బ పడిన తెలంగాణ అధికారపక్షం.. అపకీర్తిని మూటకట్టుకుంది.;

Update: 2025-03-10 04:33 GMT

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ దెబ్బ పడిన తెలంగాణ అధికారపక్షం.. అపకీర్తిని మూటకట్టుకుంది. అధికారం చేతిలో ఉన్న వేళలోనూ సిట్టింగ్ సీటును చేజార్చుకోవటం వెనుక పక్కా కసరత్తు జరగలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి అగ్రనాయకత్వం మొదలు రాష్ట్ర నాయకత్వం వైఫ్యల్యాలే ఓటమికి కారణాలుగా భావిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల(ఎమ్మెల్యేల కోటా)కు అభ్యర్థుల ఎంపిక ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సంఖ్యా బలాన్ని పరిగణలోకి తీసుకుంటే నాలుగు స్థానాల్లో పోటీ చేసే వీలున్నా.. మిత్రధర్మాన్ని పాటిస్తూ మూడు స్థానాలకు పరిమితం కావటం తెలిసిందే. తాజాగా ప్రకటించిన అభ్యర్థులు ముగ్గురు ముగ్గురే అన్న మాట వినిపిస్తోంది. పార్టీని నమ్ముకొన్న వారు.. పార్టీకి సుదీర్ఘకాలంగా విధేయతతో వ్యవహరించిన వారికే కేటాయింపులు జరిపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురు అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ ను.. పార్టీ విషయంలో వారు వ్యవహరించిన తీరును చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాలి.

కొందరు రాజకీయ నేతలు ఎంత కష్టపడినా.. లక్ మాత్రం ఉండదు. ప్రతికూల పరిస్థితుల్లో టికెట్ వచ్చి ఓడిపోవటం.. పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోవటం లాంటివి జరుగుతాయి అలాంటి కోవలోకే వస్తారు అద్దంకి దయాకర్. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు టికెట్ కేటాయింపు విషయం వెల్లడైనంతనే.. పార్టీలోని అన్ని వర్గాల నుంచి వచ్చిన మాట.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని. ఎందుకంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆయనకే కేటాయిస్తారన్న ప్రచారం సాగింది.

అనూహ్య పరిణామాలతో అద్దంకి దయాకర్ కు కాకుండా సామేల్ కు టికెట్ దక్కింది. కట్ చేస్తే.. 2024 లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ టికెట్ ఇస్తామని పార్టీ మాట ఇచ్చినా అది కూడా నెరవేరలేదు. చివర్లో హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. దీంతో.. పని చేసి.. పార్టీకి వినయవిధేయతలతో వ్యవహరించే వారికి టికెట్లు ఇవ్వరా? అన్న ప్రశ్న తలెత్తింది.ఈ విమర్శలకు తాజాగా అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఫుల్ స్టాప్ పెట్టేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. 1971 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నెమ్మికల్ గ్రామంలో పుట్టిన అద్దంకి ఉన్నత విద్యావంతుడు. పీహెచ్ డీ పూర్తిచేసిన ఆయన 2014, 2018లో తుంగుర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. పీసీసీ అధికార ప్రతినిధిగా పని చేసిన ఆయన ఎట్టకేలకు ఈ ఎన్నికలతో ప్రజాప్రతినిధి కానున్నారని చెప్పాలి.

ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్ 1972లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతావత్ తండాలో పుట్టారు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1998 - 2001 వరకు దామెరచర్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 2001, 2014 స్థానిక ఎన్నికల్లో దామెరచర్ల జనరల్ సీటు నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన ఎస్టీగా ఆయనదో హిస్టరీ. 2006-11 వరకూ దామెరచర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా.. 2011-14 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. 2016-19 వరకు మిర్యాలగూడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. 2019 నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

ప్రజల్లో పేరుతో పాటు.. అగ్రనాయకురాలిగా గ్లామర్ ఉన్నప్పటికీ రాజకీయంగా సరైన స్థానానికి ఎదిగే విషయంలో విజయశాంతి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి వివిధ పార్టీల్లో పని చేసినప్పటికి ఆమెకు సరైన పదవులు దక్కలేదు. ఎన్నికల్లో గెలిచినా.. ఆమె తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆమెకు దక్కాల్సిన పదవులు దక్కలేదని చెప్పాలి. బీఆర్ఎస్.. బీజేపీలో పని చేసిన ఆమె.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న మాట తీసుకొని పార్టీలో చేరినట్లుగా చెబుతారు.

గతంలో తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడుకున్న ఆమెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయటంతో.. ఆమెకు ఇచ్చిన మాటను పార్టీ నిలబెట్టుకున్నట్లుగా చెప్పుకోవాలి. బీసీ నినాదంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పలువురు బీసీ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆ కోటాలో బీసీ వర్గానికి చెందిన విజయశాంతికి టికెట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తాజాగా ఎంపిక చేసిన అభ్యర్థులు అసలుసిసలు ఆణిముత్యాలుగా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News