ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు నోఛాన్స్.. ఎకగ్రీవమే

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అధికార కాంగ్రెస్ కు నలుగురు అభ్యర్థుల్ని గెలిపించుకునే వీలుంది.;

Update: 2025-03-10 04:34 GMT

అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యాశకు పోవటం.. ఎన్నికల వరకు వెళ్లటం.. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసే ఎత్తులు వేయటం.. డబ్బుల సంచులు భారీగా కుమ్మరించటం..విలువల్నివదిలేసి.. విమర్శల్ని పట్టించుకోకుండా తమ పట్టును ప్రదర్శించుకోవటమే లక్ష్యంగా వ్యవహరించే ధోరణికి భిన్నంగా వ్యవహరించింది తెలంగాణ అధికారపక్షం. తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. గత అధికారపక్షానికి భిన్నంగా వ్యవహరించింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ కోటా ఎన్నికలను పోలింగ్ జరగకుండా.. ఏకగ్రీవాల దిశగా నిర్ణయం తీసుకుంది.

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అధికార కాంగ్రెస్ కు నలుగురు అభ్యర్థుల్ని గెలిపించుకునే వీలుంది. మిత్రుడైన సీపీఐకు ఒక స్థానాన్ని కేటాయించటం.. మూడు స్థానాలకే పరిమితం కావటం.. విపక్ష బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం ఉన్న ఒక్క స్థానాన్ని వదిలేయటం ద్వారా పోలింగ్ కు అవకాశం లేకుండా చేసింది. దీంతో.. తాజా ఎన్నికలు గడువు పూర్తైన వెంటనే ఏకగ్రీవం కావటం ఖాయమని చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు కాంగ్రెస్ అత్యాశకు పోకుండా ఉండటం.. కుట్రలకు తెర తీసే రాజకీయానికి దూరంగా ఉన్నామన్న సంకేతాల్ని ఇచ్చినట్లైంది.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లాంఛనమనే చెప్పాలి. నామినేషన్లకు తుదిగడువు ఈ నెల పదకొండు అంటే మంగళవారం సాయంత్రానికి పూర్తి అవుతాయి. నామినేషన్ పత్రాల పరిశీలన.. అభ్యర్థుల ఉపసంహరణకు 13 మధ్యాహ్నం వరకు గడువు ఉంటుంది. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే బరిలో ఉండటమే ఖాయమైన నేపథ్యంలో మార్చి 20న జరగాల్సిన ఎన్నికలు జరిగే వీల్లేదు. దీంతో.. ఎన్నికలు జరిగే అవకాశం లేని నేపథ్యంలో ఉపసంహరణకు గడువు ముగిసే 13నే.. అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లుగా అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. మొత్తంగా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులంతా ఎమ్మెల్సీలు అయినట్లే. కేవలం లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పాలి.

Tags:    

Similar News