ఏడాదిలో పట్టాల మీదకు మేడిన్ తెలంగాణ రైల్వే కోచ్ లు!

ఇప్పటివరకు 65 శాతం పనులు పూర్తి కావటం.. మిగిలిన 35 శాతం పనుల్నివచ్చే ఏడాది మొదట్లో పూర్తి కానున్నట్లు చెబుతున్నారు.;

Update: 2025-03-10 04:12 GMT

ఆసక్తికర అంశం వెలుగు చూసింది. సరిగ్గా మరో ఏడాదిలో మేడిన్ తెలంగాణ రైల్వే కోచ్ లు పట్టాల మీద పరుగులు తీయనున్నాయి. కాజీపేటలో ఏర్పాటు చేసిన రైల్వే మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్ లో 2026 మార్చి నుంచి రైల్వే కోచ్ ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏళ్లకు ఏళ్లుగా కాజీపేట రైల్వే కోచ్ తయారీ కేంద్రం గురించి చెబుతున్నా.. ఉత్పత్తి మాత్రం మొదలుకాని పరిస్థితి. ఇప్పటివరకు 65 శాతం పనులు పూర్తి కావటం.. మిగిలిన 35 శాతం పనుల్నివచ్చే ఏడాది మొదట్లో పూర్తి కానున్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఏడాది మార్చి నుంచి రైల్వే కోచ్ తయారీ షురూ కానుందన్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పటంతో.. పెండింగ్ పనులు శరవేగంగా సాగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోచ్ లు.. వ్యాగన్ల ఉత్పత్తి.. రిపేర్లు చేసే ఈ మాన్యేుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రూ.716 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే.. ప్రతి నెలా 50చొప్పున ఏడాదికి 600 చొప్పున ఆధునిక ఎల్ హెచ్ చీ కోచ్ లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ యూనిట్ ప్రత్యేకత ఏమంటే.. ఎల్ హెచ్ బీ కోచ్ లతోపాటు ఇంజిన్ ప్రత్యేకంగా అవసరం లేని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. ఇవి నెలకు రెండు చొప్పున ఉత్పత్తి చేస్తారు. ఒక్కో దాన్లో 12 బోగీలు ఉంటాయి. ఎంఎంటీఎస్..మెట్రో రైళ్లకు వినియోగిస్తున్నవి ఎలక్ట్ట్రిక్ మల్టిఫుల్ యూనిట్లే. ఇక్కడే గూడ్సు రైళ్ల వ్యాగన్లూ ఉత్పత్తి కానున్నాయి.

మొత్తం160 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ యూనిట్ 60,753 చదరపు మీటర్ల పరిధిలో ప్రీఇంజినీర్డ్ భవనాలు రానున్నాయి. వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాల్ని పెంచటంతో పాటు.. మేడిన్ తెలంగాణ రైల్వే కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు అవసరమైన మైట్రో రైల్ కోచ్ ల్ని కూడా కాజిపేట యూనిట్ నుంచి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News