తెలంగాణా ప్రజలు ఎందుకు టాక్స్ కట్టాలి కిషన్ జీ !?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన కేంద్రంలో తెలంగాణా నుంచి కీలక శాఖలు చూస్తున్న మంత్రిగా ఉన్నారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన కేంద్రంలో తెలంగాణా నుంచి కీలక శాఖలు చూస్తున్న మంత్రిగా ఉన్నారు. గత అయిదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి ఈసారి కూడా అవకాశం దక్కింది. ఆయనను సికింద్రాబాద్ ప్రజలు రెండోసారి ఎంపీగా గెలిపించారు.
ఆయనతో పాటుగా మరో ఏడు మంది ఎంపీలను తెలంగాణా ప్రజలు గెలిపించారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణా ఎనిమిది మంది ఎంపీలు కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి కారణం. ఉత్తరాదిన యూపీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల గట్టి దెబ్బ తగిలిన నేపధ్యంలో దక్షిణాది ఆదుకుంది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణాలో అధికార కాంగ్రెస్ తో పాటు ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం తమకు మేలు చేస్తుంది అన్న భావనతో అని అంటున్నారు.
అయితే తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు కేంద్రం ఏ వరము ప్రకటించలేదు. ఐఐఎం కలగా మారిపోయింది. విభజన హామీలు అలాగే ఉన్నాయి. ఆర్ధికంగా ఊతమిస్తూ పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయలేదు. దాంతో బీజేపీకి ఎందుకు ఓటేసి గెలిపించారు అన్న బీఅర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాటలు కూడా ఆలోచింపచేసే నేపథ్యం ఉంది.
అయితే ఇంత జరిగినా కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ ని సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. తాము తెలంగాణాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారు. కేసీఅర్ బాటలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అని అంటున్నారు. వంద రోజులలో హామీలు నెరవేరుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి వెనకడుగు వేశారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని కొత్త డిమాండ్ ని పెడుతున్నారు.
రేవంత్ రెడ్డి దయతో కేసీఆర్ దయతో తాను కేంద్రమంత్రిని కాలేదని అన్నారు. పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారు అని అన్నారు. అయితే కేసీఆర్ కాదు రేవంత్ కాదు ప్రజల దయతోనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారన్నది మరవకూడదని సెటైర్లు పడుతున్నాయి. అలాంటి ప్రజలకు మేలు చేయాలి కదా అన్నదే అంతా అడుగుతున్నారు. తెలంగాణా ప్రజలు పన్నులు కట్టడం లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా బడ్జెట్ లో వివక్ష చూపిస్తే పన్నులు ఎందుకు కట్టాలి అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.
తెలంగాణాలో గెలిపించిన ఎనిమిది మంది ఎంపీలు కూడా ఏ హామీ ఇవ్వకుండానే గెలిచారా అని కూడా జనం నుంచి వస్తున్న ప్రశ్న. ఇక తెలంగాణాలో బీజేపీకి ఏకంగా 37 శాతం వోటు షేర్ వచ్చింది. జనాలు ఆ రకమైన తీర్పు ఇచ్చారు. మరి తెలంగాణాలో బీజేపీకి పెద్ద పీట వేసి కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణం అయితే కేంద్రం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా అన్నదే జనాల ప్రశ్న.
తెలంగాణాకు కేంద్ర బడ్జెట్ లో ఒక్కటి కూడా పేరు పెట్టకుండా చేశారని అంటున్నారు. ఎందిమి మంది ఎంపీలు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఎందుకు అని కూడా అంటున్నారు. ఈ విషయంలో సొంత స్టేట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని ఎందుకు నిలదీయరని కూడా అంతా అడుగుతున్నారు.
తెలంగాణా మీద బీజేపీకి రాజకీయ ఆశలు చాలానే ఉన్నాయి. మరి వాటిని సాకారం చేసుకోవాలంటే అనుసరించాల్సిన విధానం ఇదేనా అన్నది అంతా అంటున్నారు. తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ని కోరుకున్నారు. కేంద్రంలో బీజేపీకి ఓటేశారు. అలా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
రాజకీయ విమర్శలకు కౌంటర్లు వేయడం సులువే. కానీ తెలంగాణా ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తే హాట్ కామెంట్స్ తో కాదు, మాటలతో అంతకంటే కాదు చేతలతోనే అని అంటున్నారు నిధులు చాలా వరకూ తీసుకుని వచ్చి తెలంగాణాను అభివృద్ధి చేసి చూపిస్తేనే జనాలు విశ్వసిస్తారు తప్ప రాజీనామా చేయమని ఎదుటి వారిని సవాల్ చేస్తూ డిఫెన్స్ మోడ్ నుంచి అఫెన్స్ మోడ్ లోకి వెళ్తే నష్టం బీజేపీకే అని అంటున్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి సీనియర్ మంత్రిగా కేంద్రంతో పోరాడి అయినా తెలంగాణాకు న్యాయం చేయమనే అంతా కోరుకున్నారు.