తెలంగాణ బీజేపీకి మరో మార్గం లేదా?
ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలోనూ బీజేపీకి ఈ మూడు పార్టీలు ఒకటే అనే ప్రచారం చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రేసులో ఆ పార్టీ ఇప్పటికే వెనుకబడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పుంజుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని టాక్.
ఒకే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ.. పాత సమస్యలపైనే ఫోకస్ పెడుతూ బీజేపీ సాగుతోందనే అర్థమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకటేనంటూ ఎప్పటి నుంచో చెబుతున్న బీజేపీ.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని ఎత్తుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని సంఘటనలు, మరికొన్ని ఉదంతాలను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడొద్దన్నది కాంగ్రెస్ వ్యూహం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ ఎంచుకున్న మార్గం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకటేనంటూ ప్రచారం చేయడం. ఎప్పటి నుంచి బీజేపీ ఇదే చెబుతోంది. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందంటూ ఊదరగొడుతోందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలోనూ బీజేపీకి ఈ మూడు పార్టీలు ఒకటే అనే ప్రచారం చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకటేనంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే అవి మజ్లిస్ కే వెళ్తాయని చెప్పారు. చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పడం తప్ప కొత్తగా బీజేపీ ఏం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామని బీజేపీ అంటోంది. ఇప్పటికే ఈ విషయంపై అటు షర్మిల సారథ్యంలోని వైఎస్సార్ టీపీ, ఇటు కాంగ్రెస్ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. ఇప్పుడేమో రాష్ట్రంలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఈ సమయంలో నిరుద్యోగ సమస్యను ముందేసుకోవడం వల్ల బీజేపీకి కలిగే లాభం ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న.