వార్నింగులతోనే బీజేపీకి సరిపోతోందిగా...?

అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలం అని బీజేపీ పెద్దలు అంటున్నారు. కానీ కొన్ని అనుమానాలు అలాగే ఉంటూ వస్తున్నాయి

Update: 2023-11-08 15:35 GMT

అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలం అని బీజేపీ పెద్దలు అంటున్నారు. కానీ కొన్ని అనుమానాలు అలాగే ఉంటూ వస్తున్నాయి. లిక్కర్ స్కాం కేసులో కేసీయార్ తనయ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం బ్యారేజ్ కృంగితే దాని మీద ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదు అని రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణాలో అధికారాన్ని బీజేపీకి ఇవ్వమని కోరుతున్నారు. అవినీతిపరులను జైళ్ళకు పంపించి తీరుతామని కూడా వార్నింగులు ఇస్తున్నారు. అయితే కేసీయార్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడింది అని చెబుతూ మీనమేషాలు ఎందుకు బీజేపీ పెద్దలు లెక్కబెడుతున్నారు అన్నదే పాయింట్.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు అన్నీ బీజేపీ పెద్దల చేతిలోనే ఉంటాయి. ప్రతిష్టాత్మకమైన సీబీఐ కూడా కేంద్రం వద్దనే ఉంది. మరి అవినీతి జరిగింది అని చెబుతూనే ఎపుడో అరెస్ట్ చేస్తాం, జైలు దారి చూపిస్తామని చెప్పడం ఎందుకు అని అంటున్నారు. ఇలా వార్నింగులతోనే సరిపెట్టడం ఏంటి అని అడుగుతున్న వారూ ఉన్నారు

ఇంకాస్తా వెనక్కి వెళ్తే ఏపీలో పోలవరం చంద్రబాబుకు ఏటీఎం గా మారింది అని నాటి సీఎం మీద ఏలూరు సభలో మోడీ ప్రధాని హోదాలో కీలకమైన ఆరోపణలు చేశారు. ఆ తరువాత మాత్రం చర్యలు ఏవీ లేవు అని అంటున్నారు. మరి నిజంగా బాబు తప్పు చేశారా లేక ఎన్నికల ప్రసంగాలలో ఇది భాగంగా చేసుకుని కామెంట్స్ చేస్తున్నారా అన్నదే చర్చకు వస్తోంది.

ఇక్కడే కేంద్ర ప్రభుత్వం మాటల వరకే పరిమితం అవుతోంది అని అంటున్నా వారూ ఉన్నారు. అయితే అన్ని చోట్లా ఒకే నీతి రాజకీయ రీతి అమలు చేయడం లేదు అని కూడా ఎత్తి చూపుతున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ మంత్రుల మీద జోరు చేశారు. ఈడీ కేసులు ఏకంగా అక్కడి సీఎం మీద కూడా పెట్టారు.

అలాగే బీయారెస్ ఆరోపిస్తున్న విషయం చూస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మరి తదుపరి చర్యలు ఏవీ అని. అదే విధంగా రేవంత్ రెడ్డి లాంటి వారు అడుగుతోంది లిక్కర్ కేసులో అనేక సార్లు పిలిపించి ఈడీ కవితను విచారించి చివరికి అరెస్ట్ ఎందుకు చేయలేదని.

ఇలా బీయారెస్ తో బీజేపీ కుమ్మక్కు అని కాంగ్రెస్ ఆరోపిస్తూంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీయార్ అంటున్నారు. మేడిగడ్డ వద్ద కృంగింది అని కాంగ్రెస్ హడావుడి చేస్తే ఏకంగా కేంద్రం రిపోర్టు ఇచ్చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికే ఏదో అయిపోయిందని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నాయని ఆయన విమర్శిస్తున్నారు.

మరో వైపు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా ఇతర బీజేపీ పెద్దలు అయినా హెచ్చరికలు చేస్తూ ప్రత్యర్థుల మీద సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ జనంలో అవి ఎంతవరకూ పట్టింపుగా ఉంటున్నాయన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి

ఎందుకంటే తెలంగాణాకు వచ్చిన ప్రతీసారీ విమర్శలు చేయడం అవినీతి అని చెప్పడం, కుటుంబ పార్టీలు అని నిందించడం తప్ప నిజంగా యాక్షన్ లోకి ఎందుకు దిగరు అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఇక బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ చేస్తున్న ప్రచారం లో కూడా డొల్లతనాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి.

బీసీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన్ని తప్పించేశారు. ఆ ప్లేస్ లో కిషన్ రెడ్డిని తెచ్చారు. ఇపుడు మాత్రం బీసీని సీఎం ని చేస్తామని చెప్పడం వల్ల బీజేపీ మీద నమ్మకం ఉంటుందా అని అడుగుతున్న వారూ ఉన్నారు. బీజేపీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్లుగానే ఆది నుంచి తెలంగాణాలో చేస్తోంది అని అంటున్నారు.

దాంతోనే బీజేపీ గ్రాఫ్ ఇపుడు ఒక్కసారిగా పడిపోయింది అని అంటున్నారు. ఏది ఏమైనా హెచ్చరికలు ఇస్తే చప్పట్లు సభకు వచ్చిన వారి చేత కొట్టించుకోవచ్చు, కానీ ఓట్లు వేయాల్సిన కోట్లాదిమంది ఆ హెచ్చరికల వెనకాల ఉన్న చిత్తశుద్ధిని చూస్తారు అని అంటున్నారు. సో బీజేపీ తెలంగాణాలో చేస్తున్న ఎన్నికల పోరాటంలో ఎంత దూరం వెళ్ళింది అన్నది ఫలితాలే చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News