ముద్రగడ ఇంటిపై దాడి డ్రామా : ఎంపీ సానా సతీశ్ మాస్ రియాక్షన్

ముద్రగడ ఇంటిపై ఆకతాయి దాడిని రాజకీయం చేయడం నీచమని ఎంపీ సానా సతీశ్ వ్యాఖ్యానించారు.

Update: 2025-02-03 10:30 GMT

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి రాజకీయ రగడగా మారుతోంది. ఆదివారం వేకువ జామున ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి ప్రహరీని ధ్వంసం చేయడంతోపాటు, ఆయన వాహనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. అధికార పార్టీ అరాచకాలకు ఇది నిదర్శనమని ఆరోపించింది. అయితే వైసీపీ విమర్శలపై స్పందించిన అధికార కూటమి ఘాటు సమాధానమిచ్చింది. టీడీపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, జనసేన నుంచి ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ ఇద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఇంటిపై దాడిని ఓ డ్రామాగా అభివర్ణించారు.

ముద్రగడ ఇంటిపై ఆకతాయి దాడిని రాజకీయం చేయడం నీచమని ఎంపీ సానా సతీశ్ వ్యాఖ్యానించారు. దాడి చేసిన వ్యక్తి గతంలో ముద్రగడ ఇంటిలో పనిచేశారని, వ్యక్తిగత లావాదేవీల వల్లే గొడవ చేసి ఉంటాడని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు. మద్యం మత్తులో ఉన్న ఆకతాయి ఏదో చేస్తే, దాన్ని పట్టుకుని వైసీపీ రాజకీయం చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. వైసీపీ ఆడిస్తున్న ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వైసీపీ.. ఇంకా పాతాళంలోకి పడిపోతున్నామనే ఆందోళనతో ఇలాంటి డ్రామాలకు దిగుతోందని విమర్శించారు.

మరోవైపు ఇదే విషయమై స్పందించిన జనసేన నాయకురాలు, ముద్రగడ కుమార్తె క్రాంతి.. తన తండ్రి ఇంటిపై జరిగిన దాడి తనను బాధపెట్టిందన్నారు. దాడి చేసిన వ్యక్తికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడు జైజనసేన అన్నంత మాత్రాన జనసేన కార్యకర్త అయిపోడనే విషయాన్ని గుర్తించాలని కోరారు. ఇలాంటి చర్యలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమర్థించరని తెలిపారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేనట్లుందని, ఎవరో చేసిన పనిని జనసేనకు ఆపాదించడం తగదని క్రాంతి అభిప్రాయపడ్డారు.

కాగా, ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు గన్నిశెట్టి గంగాధర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ ఇంటి కాంపౌండ్ వాల్ ధ్వంసానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకుంటున్నారు. నిందితుడు కావాలనే ఈ దశ్చర్యకు పాల్పడ్డాడా? ఎవరైనా ప్రోత్సహించారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News