తుక్కుగూడ సభలో తుక్కు రేగొట్టేలా....!
తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది.;
తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. ఈసారి వదిలేది లేదు, గివప్ అన్నది మా అజెండాలోనే లేదు అంటోంది. 2014లో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన పెట్టి కేసీయార్ నాయకత్వంలోని టీయారెస్ ని తెలంగాణా గెలిపించింది.
అయితే అప్పట్లో పదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీలో సాగిన పాలన వల్ల ఏర్పాడిన యాంటీ ఇంకెంబెన్సీ వల్లనే పరాజయం పాలు అయ్యామని కాంగ్రెస్ గ్రహించింది. దాని కంటే ముందు కేసీయార్ ని గుడ్డిగా నమ్మేసి ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు ఇంకేముంది ఎదురు అనుకుంటూ ముందుకు పోవడం వల్ల కూడా హస్త రేఖలు చెదిరిపోయాయి.
అలా గివప్ అంటూ కాంగ్రెస్ చేతులు వదిలేసి చేష్టలుడిగి చూసిన నేరం ఈ రోజుకూ పాపంగా మారింది. 2018 నాటికి కాంగ్రెస్ లో అనైక్యత ఇంకా పీడించింది. దాంతో పాటు టీయారెస్ కాంగ్రెస్ ని గట్టిగా టార్గెట్ చేసి ఉన్న లీడర్ ని క్యాడర్ ని వీక్ చేసి పారేసింది.
అయితే 2023 ఎండింగ్ లో జరిగే ఎన్నికలు అలా ఉండవని కాంగ్రెస్ భావిస్తోంది. అగ్ర నేతలు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఎన్నడూ లేనిది సీడబ్ల్యూసీ మీటింగ్ తెలంగాణా నడిబొడ్డు హైదరాబాద్ లో పెట్టడం అంటే కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు కచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు.
ఇక రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో తుక్కు రేగొట్టేలా స్పీచ్ ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అనేలా ఆయన ఉత్సాహం ఉపన్యాసంలో కనిపించింది అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ఏకంగా ఒకేసారి మూడు పార్టీలతో పోరాడుతోద్ని అని రాహుల్ అనడం విశేషం. బీయారెస్, బీజేపీ ఎం ఐ ఎం మూడూ వేరు రూపాలలో ఉన్నా కూడా ఒకేలా ఉన్నాయని ఆయన ఆరోపించడం విశేషం.
బీజేపీ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు బీయారెస్ మద్దతు ఇచ్చిన సంగతిని రాహుల్ గుర్తు చేశారు. కేసీయార్ ఎంఐఎం నేతలు మోడీకి సొంత మనుషులు అని రాహుల్ మరో ఆరోపణ చేశారు. కేసీయార్ సర్కార్ ఎంతటి అవినీతి చేసినా మోడీ సర్కార్ కన్నెత్తి చూడదని, దానికి కారణం బలమైన బంధం ఉండడం వల్లనే అని ఆయన అంటున్నారు.
మరో వంద రోజులలో బీయారెస్ సర్కార్ ఇంటికి వెళ్తుందని, కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ ధీమాగా చెప్పుకొచ్చారు. ఈసారి కాంగ్రెస్ విజయాన్ని బీయారెస్, బీజేపీ ఎంఐఎం ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేవని ఆయన అనడం విశేషం.
మొత్తానికి తాము తెలంగాణాలో తమ ప్రత్యర్ధులను తెర వెనక శత్రువులను గుర్తించామని వారందరినీ ప్రజా క్షేత్రంలో ఓడిస్తామని పవర్ ఫుల్ స్పీచ్ తో రాహుల్ తేల్చి చెప్పారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిశ్చయించిందని తెలిపారు. అంతే కాదు తెలంగాణా ప్రజల మీద వరాల జల్లు కురిపిస్తూ కాంగ్రెస్ హామీలు ఎన్నో ఇచ్చింది. టోటల్ గా చూస్తే ఈసారి కాంగ్రెస్ రాజ్యం అంటూ కాంగ్రెస్ చేస్తున్న సవాల్, ఇస్తున్న స్లోగన్ మీదనే రాజకీయాలు నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.