ఎన్నికలు : ఆర్ధిక వ్యవస్థకు ఊతంగా...నల్లటివన్నీ తెల్లగా...!
నల్లటి వన్నీ నీళ్ళు అనుకోవద్దు తెల్లటివన్నీ పాలనుకోవద్దు అని మనకు ఒక ముతక సామెత ఉంది
నల్లటి వన్నీ నీళ్ళు అనుకోవద్దు తెల్లటివన్నీ పాలనుకోవద్దు అని మనకు ఒక ముతక సామెత ఉంది. కానీ నలుపు ఎపుడూ అలాగే ఉండిపోదు అది తెల్లగానూ మారుతుంది. నోట్ల రద్దు వంటి పెద్ద కసరత్తులు ఎన్ని చేసినా బయటకు రాని నల్లధనం కాస్తా ఎన్నికల వేళ ప్రవాహంగా ముందుకు వస్తుంది.
పై నుంచి దిగువకు అలా ప్రవహిస్తూ పోతుంది. దాంతో ప్రతీ ఎన్నిక కూడా ఆర్ధిక వ్యవస్థకు అంతో ఇంతో ఊతమిచ్చేలాగానే ఉంటుంది అనుకోవాలి. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
ఒకపుడు ఎమ్మెల్యే కావాలంటే పది వేల రూపాయలతో అయ్యేది. ఇపుడు పదుల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అలా చూస్తే కనుక ఒక్కో నియోజకవర్గానికి ముప్పయి కోట్ల దాకా అభ్యర్ధులు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా అభ్యర్థులు కాకుండా ఆయా పార్టీలు పెట్టే ఖర్చు కూడా వాటికి తోడుగా ఉంటుంది.
అలాగే మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ లెక్కను కనుక అంచనాగా తీసుకుంటే ప్రతీ నియోజకవర్గంలో వంద కోట్లకు తక్కువ కాకుండా ఎన్నికల పేరిట ధన ప్రవాహం సాగుతోంది అని అంటున్నారు. అంటే మొత్తం తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఖర్చు చూస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు ఉన్నట్లుగానే లెక్క వేస్తున్నారు.
వీటికి ప్రభుత్వాలు చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. ఇలా చూస్తే కనుక పెద్ద మొత్తంలోనే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ధనం అంతా తెల్ల ధనమేనా అంటే కాదు అనే జవాబు వస్తుంది. ఎందుకు అంటే ఎన్నికల సంఘం పెట్టే నిబంధనలు అలా కఠినంగా ఉన్నాయి మరి.
వారి నిబంధలను చూసుకుంటే ఈ పెట్టే మొత్తంలో కేవలం అయిదు పది శాతం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం వేయి కోట్లతో ఎన్నిక అనుకున్న అదంతా మాత్రమే లెక్కల్లో చూపించే తెల్ల ధనంగా పరిగణించాఇ.
మిగిలిన పది పన్నెండు వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అంటే అది అందరికీ తెలిసిన విషయమే. అదంతా నల్లధనమే. మరి ఆ ధనం ఇంతకాలం ఎక్కడ ఉంది అంటే నేల మాళిగలలో ఉండి ఉండొచ్చు. లేదా ఏ గోడల మధ్యలో ఉండొచ్చు. లేదా మరే నిక్షిప్త ప్రదేశాలలో నిక్షేపంగా ఉండొచ్చు.
ఇపుడు ఆ డబ్బు అంతా జనంలోకి వచ్చింది. ఒక్కసారిగా తెల్లగా మారిపోయింది. మరి ఇలా జనంలోకి వచ్చిన మొత్తం ఊరకే ఉండదు కదా దాంతో బంగారాలు, భూములు ఇతర అవసరాలకు వాహనాల కొనుగోళ్ళకు కూడా ఖర్చు పెడతారు. అంటే ఒక్కసారిగా మార్కెట్ పుంజుకుంటుంది అన్న మాట.
అంతే కాదు నెల రోజుల ప్రచారంతో వచ్చీ పోయే బడా నాయకులు ఇతర ప్రచార కర్తలు వాళ్ళూ వీళ్ళూ అంతా కలసి బస చేసేందుకు హొటళ్ళు రెస్టారెంట్లు ఇలా చాలా ఉంటాయి. దాంతో రెస్టారెంట్లకు కూడా ఇబ్బడి ముబ్బడి గా ఆదాయం వస్తుంది.
మరో వైపు చూస్తే వాహనాలు ప్రతీ చోటా తిరుగుతున్నాయి. దాంతో వాటికి అయ్యే పెట్రోల్ డీజీల్ ఇవన్నీ కూడా ఇంధన విక్రయాన్ని పెంచేస్తాయి. అలాగే మద్యం బార్ అండ్ రెస్టారెంట్ ఖర్చు మరో లెవెల్ లో ఉంటుంది. ఇలా ఎన్నికలతో సంబంధం ఉన్న ప్రతీ రంగానికి కేవలం ఒక్క నెల రోజులలోనే ఏడాదికి సరిపడా బిజినెస్ జరుగుతుంది అని ఒక అంచనా.
అదే విధంగా ప్రతీ రోజూ ప్రచారానికి జెండా మోసే కూలీలు నినాదాలు చేసే వారు మీటింగులకు వచ్చే జనాలు ఇలా చూసుకుంటే వారికి కూడా నెల రోజుల పాటు ఉపాధి దొరుకుతుంది. వీటికి మించి పోలింగ్ రోజున ప్రతీ అన్ని పర్టీ పెట్టే ఖర్చు చాలా ఎక్కువ.
అది మొత్తం ముప్పై రోజులకు సమానంగా ఉంటుంది. అలా అన్ని పార్టీలు పెట్టే ఖర్చు గల్లీ నుంచి టౌన్ దాకా ఉండే లీడర్ల దాకా జరిగే సరఫరాలు ఇవన్నీ చూసుకుంటే కరెన్సీ రివర్ పారుతోంది అని చెప్పాల్సిందే. ఇక మీడియా సంస్థలకు కూడా ఎన్నికలు మంచి బూస్టింగ్ ఇస్తాయి. కరవు తీరేలా వారికి ప్రకటనలు రూపంలో ఇతర ఆదాయాలు వస్తాయి.
నష్టాలలో ఉన్న మీడియా రంగానికి కూడా ఈ ఎన్నికలు చాలా ఊతాన్ని ఇస్తాయనే అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు ఎన్నికల్లో ధన స్వామ్యాన్ని అరికట్టాలి అని ఒక వైపు అంటున్నా మరో వైపు చూస్తే నల్లగా పరచుకున్న ధనం తెల్లగా మారీ నదిలా ప్రవహించి అన్ని చోట్లకు చేరడం ద్వారా ఆర్ధిక వ్యవస్థకు బలం ఇస్తోంది అన్న అంచనాలు కూడా తప్పు కాదేమో అనిపిస్తోంది.