'దమ్ము' మాటలు సరే.. పవర్ లో ఏమైంది కేటీఆర్.. హరీశ్?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో నిరసన తెలపటానికి.. ఆందోళన చేయటానికి ప్రకటన చేసినంతనే సదరు నేతల్ని హౌస్ అరెస్టు చేయటం.. బయటకు రాకుండా చేయటం లాంటివి ఎన్ని చూడలేదు.

Update: 2024-08-18 07:30 GMT

విషయం ఏదైనా సరే.. తమ మాటల్లో అదే పనిగా దమ్ము గురించి ప్రస్తావిస్తున్నారు గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు కేటీఆర్.. హరీశ్ లు. పదేళ్లు సాగిన గులాబీ పాలనలో ఈ ఇద్దరు బావ బామ్మర్దులు ఎంతటి కీరోల్ ప్లే చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి.. దమ్ముంటే గన్ పార్కు వద్దకు రా.. దమ్ముంటే కొడంగల్ కు రా.. దమ్ముంటే ఎక్కడికి వస్తావో చెప్పు.. మేం అక్కడికి వస్తామన్న మాటలు పదే పదే చెబుతున్నారు.

అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి దమ్ము ప్రస్తావన తెస్తున్న ఈ ఇద్దరు గులాబీ నేతలకు సామాన్యులు ఒక సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. పవర్ చేతిలో లేని వేళ.. దమ్ము గురించి మాట్లాడే ఈ ఇద్దరు నేతలు.. తాము అధికారంలో ఉన్నప్పుడు నాడు విపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు.. ఇంతే దమ్ముగా ఫలానా చోటకు రండి.. మీరు చేసిన ఆరోపణల్లో ఎలాంటి పస లేదని నిరూపిస్తానని చెప్పి.. నిరూపించి ఉంటే ఈ దమ్ము మాటలు బాగుంటాయి.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో నిరసన తెలపటానికి.. ఆందోళన చేయటానికి ప్రకటన చేసినంతనే సదరు నేతల్ని హౌస్ అరెస్టు చేయటం.. బయటకు రాకుండా చేయటం లాంటివి ఎన్ని చూడలేదు. అంతేనా.. ప్రభుత్వ విధానాల మీద ఎవరైనా తీవ్రస్థాయిలో పోరాడుతుంటే.. వారి గళం బయటకు రాకుండా మీడియా సంస్థల మీద పరిమితులు విధించటం లాంటివెన్నో. ఒకవేళ.. మీడియాలో వచ్చినా.. వాటికి ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వకూడదన్న మాట వెళ్లటం లాంటివి ఎన్ని చూడలేదు.

అలాంటి కేటీఆర్.. హరీశ్ లు ఈ రోజున సుద్దపూసల మాదిరి మాట్లాడుంటే ఏమనాలి? ఎలా చూడాలి? రైతురుణ మాఫీ గురించి గుండెలు బాదేసుకుంటూ.. చాలామందికి రాలేదు.. అందలేదన్న మాటను చెబుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ఎన్నో తీపి మాటలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. తాము నిర్మించిన వేలాది ఇళ్లను అలా వదిలేశారే తప్పించి.. లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు? అన్నది ప్రశ్న. తమ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు వివిధ పథకాలకు సంబంధించిన లబ్థిదారులకు మేలు చేయటంలో ఫెయిల్ అయిన పరిస్థితి. అలాంటి ఇద్దరు నేతలు ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ పై ఒంటికాలి మీద ఎగురుతున్నారు. గతాన్ని మర్చిపోయే అలవాటున్న కేటీఆర్.. హరీశ్ లు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరుతో నీతులు చెబుతున్నప్పటికీ.. అధికారంలో ఉన్నప్పుడు వారి తీరును మాత్రం ప్రజలు మర్చిపోలేకపోతున్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News