70 సీట్ల‌లో గెలుపు మాదే.. స‌ర్వేల‌ను న‌మ్మేది లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిపోయినా.. మాట‌ల మంట‌లు మాత్రం ఆగ‌డం లేదు

Update: 2023-11-30 15:41 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిపోయినా.. మాట‌ల మంట‌లు మాత్రం ఆగ‌డం లేదు. పోలింగ్ ముగియ‌గానే.. ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఐదారు సంస్థ‌లు తెలంగాణ ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేశాయి. ఈ ఫ‌లితాల ప్ర‌కారం.. అధికార బీఆర్ ఎస్ పార్టీ ఓట‌మి అంచున వేలాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది. ఏస‌ర్వే చూసినా.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది.

ఈ ఫ‌లితంపై స‌హ‌జంగానే బీఆర్ ఎస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ .. వెంట‌నే స‌ర్వేల‌పై నిప్పులు చెరిగారు. స‌ర్వేల‌ను తాము న‌మ్మ‌బోమ‌ని వెల్ల‌డించారు. తాము 70 స్థానాల్లో గెలుస్తున్నామ‌ని.. హ్యాట్రిక్ విజ‌యం సొంతం చేసుకుంటామ‌ని, మ‌రోసారి కేసీఆర్ సీఎం అవుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు..స‌ర్వే సంస్థ‌లకు ఏదో న‌లుగురిని అడిగి రిజల్ట్ ప్ర‌క‌టించే అల‌వాటు ఉంద‌ని.. తెలంగాణ స‌మాజం మొత్తాన్ని స‌ర్వే సంస్థ‌లు.. ప్ర‌శ్నించ‌లేద‌న్నారు.

గ‌త 2018 ఎన్నిక‌ల్లోనూ ఇలానే త‌మ‌కు వ్య‌తిరేకంగా స‌ర్వే సంస్థ‌లు రిజ‌ల్ట్ ఇచ్చాయ‌ని కేటీఆర్ వ్యాఖ్యానిం చారు. మూడో తేదీన స‌ర్వే సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితం ఉంటుంద‌ని.. అప్పుడు స‌ర్వేల సంస్థ‌లు క్ష‌మాప‌ణ‌లు చెబుతాయా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌కు ఏం చూసి జ‌నాలు ఓటేయాల‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ స‌మాజం అంతా కూడా.. సీఎం కేసీఆర్‌తోనే ఉంద‌ని అన్నారు.

''మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్ కొడతాం. 2018 తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ రబ్బిష్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ గతంలోనూ చూశాం. మాకు కొత్తకాదు. డిసెంబర్‌ 3న మళ్లీ అధికారం చేపడతాం. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదు. 70 పైగా స్థానాల్లో తిరిగి అధికారంలోకి వస్తాం. ఎగ్జిట్ పోల్స్‌తో న్యూసెన్స్ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ కు ఎలా పర్మిషన్ ఇస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెప్తారా?" అని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు..

Tags:    

Similar News