డ్రగ్స్‌ @ 40,000

ఇప్పుడు మత్తు పదార్థాలు దొరకని ప్రదేశం లేదు. గంజాయి రూపంలో మారుమూల పల్లెలకు కూడా చేరిపోయింది.

Update: 2024-08-23 08:34 GMT

ఇప్పుడు మత్తు పదార్థాలు దొరకని ప్రదేశం లేదు. గంజాయి రూపంలో మారుమూల పల్లెలకు కూడా చేరిపోయింది. దీనిబారినపడి ఎంతో మంది యువత విలవిల్లాడుతున్నారు. బంగారు భవిష్యత్‌ ను నాశనం చేసుకుంటున్నారు. ఉన్నత ఉద్యోగులు చేసే యువతీయువకులు సైతం డ్రగ్స్‌ పంజాలో చిక్కుకుంటున్నారు. మొదట మిత్రుల ద్వారా నిదానంగా డ్రగ్స్‌ కు అలవాటుపడుతున్న యువతీయువకులు తర్వాత వాటికి పూర్తిగా బానిసలవుతున్నారు.

హైదరాబాద్‌ లో మంచి ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు వీకెండ్స్‌ లో పబ్‌ లకు వెళ్తూ అక్కడ మద్యం, డ్రగ్స్‌ కు అలవాటుపడుతున్నారని పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నారని అంటున్నారు. ఆర్థికంగానూ నష్టపోతున్నారని పేర్కొంటున్నారు.

అలాగే ఉద్యోగాల కోసం, వివిధ పోటీ పరీక్షల్లో కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ కు వస్తున్నవారు మిత్రుల ప్రోద్భలంతో గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. తద్వారా ఇంట్లోవారు తమ ఫీజులు, హాస్టల్, ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన మొత్తాలను డ్రగ్స్‌ కోసం వినియోగిస్తున్నారు.

డ్రగ్స్‌ సేవించి లేదా ప్లెడ్లర్‌ (డ్రగ్స్‌ రవాణా) గా మారి పోలీసులకు చిక్కి కేసుల పాలవుతున్నారు. తమ కుమారుడు లేదా కుమార్తె హైదరాబాద్‌ లో ఉద్యోగం చేసుకుంటున్నారని లేదా కోచింగ్‌ తీసుకుంటున్నారని భావిస్తున్న తల్లిదండ్రులు పోలీసుల నుంచి తమకు ఫోన్‌ కాల్స్‌ వస్తే కానీ పరిస్థితి ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు.

ఇలా ఎంతో మంది చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు డ్రగ్స్‌ బారినపడుతున్నారని టీజీ న్యాబ్‌ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారమే 40 వేల మంది యువతీయువకులు డ్రగ్స్‌ సేవిస్తున్నారు.

డ్రగ్స్‌ ను వినియోగిస్తున్న ఈ 40 వేల మందిలో సుమారు 6 వేల మందికి ఇప్పటికే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువతను ఈ మహమ్మారి నుంచి బయటపడేయడానికి టీజీ న్యాబ్‌ రంగంలోకి దిగింది. మత్తుపదార్థాల సరఫరాదారులు, విక్రేతలతోపాటు వాటికి అలవాటుపడి భవిష్యత్తును పాడుచేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తిస్తోంది,

డ్రగ్స్‌ రవాణా చేసే పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారంతోపాటు ర్యాండమ్‌ గా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు తెలంగాణలో 40 వేల మందికిపైగా డ్రగ్స్‌ సేవించేవారిని గుర్తించింది. వారికి కౌన్సెలింగ్‌ ఇస్తూ మహమ్మరి నుంచి బయటకు తెస్తోంది. అయితే ప్రతి 100 మందిలో 90 మంది తమ స్నేహితుల ప్రోద్బలంతోనే మొదటిసారి గంజాయి తాగామని చెప్పడం విశేషం. ఆ తర్వాత నుంచి నిదానంగా డ్రగ్స్‌ కు అలవాటుపడ్డామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బంగారు భవిష్యత్‌ ఉన్న యువత డ్రగ్స్‌ బారినపడకుండా టీజీ న్యాబ్‌ చర్యలు చేపడుతోంది. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్బుల్లో ర్యాండమ్‌ గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కాగానే వారి కుటుంబసభ్యులకు సమాచారమిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఇప్పించి ఇళ్లకు పంపుతున్నారు. పరిస్థితి తీవ్రంగా డీ అడిక్షన్‌ సెంటర్లకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News