రాజకీయాల్లోకి విజయ్.. వారు మీటింగ్ పెట్టి ఓకే చెప్పారు
తమిళ రాజకీయాలన్నంతనే కరుణానిధి.. జయలలిత అన్నట్లు ఉండేది. ఇద్దరు నేతలు ఇప్పుడు లేరు.
తమిళ రాజకీయాలన్నంతనే కరుణానిధి.. జయలలిత అన్నట్లు ఉండేది. ఇద్దరు నేతలు ఇప్పుడు లేరు. ఈ మధ్యనే సినీ నటుడు కమ్ రాజకీయ నేత విజయకాంత్ కాలం చేశారు. తమిళనాడు రాజకీయాల్లోఒకలాంటి స్తబద్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. కొత్త వారు వస్తే.. వారికి బోలెడన్ని అవకాశాలున్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్పటం తెలిసిందే. ఈ వాక్యూమ్ ను భర్తీ చేసేందుకు ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కు తమిళనాడులోనే కాదు కేరళలోనూ భారీ అభిమానగణం ఉందన్న సంగతి తెలిసిందే.
త్వరలోనే తన పార్టీ ప్రకటనను ఆయన చేస్తారని చెబుతున్నారు. తాజాగా చెన్నైలో విజయ్ అభిమానుల సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కమ్) సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులోతమ ఆరాధ్య దైవం విజయ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం పలికారు. దీంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీ నియమ నిబంధనలు ఎలా ఉండాలన్న దానిపైనా ఆయనే నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన అధికారాన్ని ఆయనకే వదిలేసింది.
నిజానికి విజయ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి గతంలో ప్రకటన చేయటం తెలిసిందే. తాను 2026 ఎన్నికల నాటికి బరిలో ఉంటానని చెప్పేశారు. తాజా పరిణామాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా చెప్పాలి. అయితే.. విజయ్ రాజకీయ పార్టీ ప్రకటన లోక్ సభ ఎన్నికలకు ముందా? తర్వాతా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరో నెలలో పార్టీ ప్రకటన పూర్తి చేస్తారని చెబుతున్నారు.
అయితే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా అధికార ప్రకటన చేసి.. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే వీలుందంటున్నారు. ఓవైపు నటుడిగానే కాదు.. పలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపడుతున్న ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచి అవకాశాలు ఉంటాయన్న వాదన ఉంది. ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయ్ అభిమానుల సంఘం పోటీ చేయటం తెలిసిందే. తాజా పరిణామాల్ని చూస్తే.. తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లేనని చెప్పక తప్పదు.