కురియన్ కమిటీ .. తేల్చేదేంటి?!
తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు దాటిపోయింది. ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధిస్తాం అనుకున్న బీజేపీ 240 ఎంపీ స్థానాలకు పరిమితం కాగా, గతంలో రెండు సార్లు ప్రతిపక్ష హోదా దక్కని కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా వంద స్థానాలను గెలుచుకుని బీజేపీకి చెమటలు పట్టించింది. తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది.
దేశంలో కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలిసి భాగస్వామిగా ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకే ఎందుకు పరిమితం అయింది ? నిగ్గు తేల్చాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత జేపి కురియన్ నేతృత్వంలో రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ లు సభ్యులుగా నిజనిర్ధారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నది. ఈ రోజు గాంధీభవన్ లో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్నది. రేపు పార్టీ ఎమ్మెల్యేలతో, మూడో రోజు జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులతో భేటీ అయి వివరాలు సేకరించనున్నది. ఇక క్షేత్ర స్థాయి పర్యటనలు ఉంటాయా ? ఉండవా ? అన్న విషయం తెలియదు.
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, నిజామాాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ స్థానాలలో ఓటమిపై ప్రధానంగా విచారించనున్నట్లు సమాచారం. స్థానిక నేతలు సరిగ్గా పనిచేశారా ? శాసనసభ్యులు, అభ్యర్థుల మధ్య సమన్వయం లోపించిందా ? పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేశారు ? పార్టీ ప్రచారం ఎలా నిర్వహించారు ? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం కావడానికి ఏఏ అంశాలు దోహదం చేశాయి ? అన్న వాటిపై కురియన్ కమిటీ ఆరా తీయనున్నట్లు చెబుతున్నారు.
అయితే గత లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఎన్నికల హామీలు నెరవేర్చకున్నా లోక్ సభ ఎన్నికల్లో వాటి ప్రభావం పడకుండా ఎనిమిది స్థానాలలో విజయం సాధించడం చిన్న విషయం ఏం కాదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ప్రస్తుతం ఈ కురియన్ కమిటీ వ్యవహారం అనవసర ప్రయాస అని, ఈ కమిటీతో ఒరిగేది ఏమీ లేదని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.