జగన్ ని చూసే చంద్రబాబు అలా చేస్తున్నారా ?

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికే పెద్ద పీట వేస్తారు అన్నది ఆయన ట్రాక్ రికార్డు చూస్తే అర్ధం అవుతున్న విషయం.

Update: 2025-01-29 05:30 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికే పెద్ద పీట వేస్తారు అన్నది ఆయన ట్రాక్ రికార్డు చూస్తే అర్ధం అవుతున్న విషయం. ఆయన 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్నపుడు రెండు రూపాయలు ఉన్న కిలో బియ్యాన్ని అయిందుంపావలా చేసారు. అలాగే ఇతర సంక్షేమ పధకాల విషయంలో చేశారు.

ఆయన ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా ఉన్నపుడు విజనరీ అనిపించుకునేందుకు ఆరాటపడ్డారు. ఆయన సంస్కరణలాభిలాషిగానే పాలన చేశారు. అయితే వైఎస్సార్ ఉచిత విద్యుత్ అని ఇతర సంక్షేమ పధకాలతో 2004లో కాంగ్రెస్ ని గెలిపించడంతో బాబు రూట్ మార్చారు.

అలా 2009 వచ్చేసరికి ఆయన అన్నీ ఉచితం అని జనాల వద్దకు వెళ్ళారు దానిని ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్సార్ ఎద్దేవా చేశారు కూడా. అయితే ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ రెండవ మారు వరసగా గెలిచింది. ఇక 2014లో విభజన ఏపీలో బాబుకు అనుభవం తో పాటు ఉచిత హామీలు కలసి వచ్చాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అన్నది బ్రహ్మాస్త్ర మైంది. అలా గెలిచిన బాబు చాలా హామీలు నిలబెట్టుకోలేదు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు.

దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆనాడు జగన్ వైసీపీ తరఫున ఉచిత హామీలతో జనంలోకి వెళ్ళి 151 సీట్లు గెలుచుకున్నారు. 2024 ఎన్నికలు టీడీపీకి ప్రాణప్రదంగా భావించి బాబు అనేక హామీలను గుప్పించారు. సూపర్ సిక్స్ అన్నారు. జగన్ కంటే ఎక్కువ పధకాలు ఇస్తామని చెప్పారు.

దానికి సంపదను సృష్టించి అమలు చేయడం ఎలాగో తనకు తెలుసు అన్నారు. జనాలు నమ్మి ఓటు వేశారు. ఇక చూస్తే 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అసెంబ్లీ బయటా లోపలా వీలు కుదిరినపుడల్లా ఏపీ వట్టిపోయిందని ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూ వచ్చారు. ఎన్నో శ్వేత పత్రాలు రిలీజ్ చేసారు. జగన్ హయాంలో మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిందని అన్నారు.

చివరకు ఎనిమిది నెలల పాలన తరువాత తాపీగా ఒక బాంబు పేల్చారు. సంక్షేమ పధకాలు అమలు చేయలేమని కూడా తేల్చేశారు. దీంతో అంతో ఇంతో ఆశ పెట్టుకున్న వారు అంతా పూర్తిగా నిరాశలోకి నెట్టబడ్డారు. పధకాలను జగన్ అలవాటు చేశారు. చేతిలో డబ్బు ఆడుతూ గత కాలం గడచింది.

ఇపుడు పరిస్థితి అలా లేదని జనంలో నిర్వేదం ఉంది. అయితే దీనిని ఎలా అధిగమించాలో బాబుకు తెలిసే ఇలా చేశారు అన్న చర్చ వస్తోంది. ఇంకా చేతిలో నాలుగేళ్ళ నాలుగు నెలల అధికారం ఉంది. దాంతో చంద్రబాబు జనాలకు పదే పదే పధకాల గురించి ఆలోచించే పరిస్థితిని తప్పించారు అనుకోవాలి. అలాగే తాను అనుకున్న దానికి అడ్డు తగిలేలా ఈ గోల కూడా ఉండకూడదనే ఇలా చేశారు అనుకోవాలి.

ఏపీలో అభివృద్ధి లేదని అందుకే తనకు అధికారం అప్పగించారు అని బాబు అర్ధం చేసుకున్నట్లుగా ఉన్నారు. దాంతోనే ఆయన అమరావతి పోలవరం వంటి ఈ రెండు కీలక ప్రాజెక్టుల మీదనే ఫోకస్ పెట్టారు. వీటిని ఎట్టి పరిస్థితులలో 2029 నాటికి పూర్తి చేసి చూపించి ఎన్నికలకు వెళ్ళాలన్నది బాబు ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

వీలు అయితే చివరి ఏడాది కాలంలో సంక్షేమ పధకాలు అమలు చేయాలని కూడా బాబుకు ఆలోచన ఉండి ఉండాలి. అపుడు జనాలు గుర్తు పెట్టుకుని మరీ ఓటు వేస్తారని అలా తాను మళ్ళీ గెలిచేందుకు వీలు అవుతుందని ఆయన మాస్టర్ ప్లాన్ తోనే ఇపుడు పధకాల మీద తేల్చేశారు అని అంటున్నారు.

ఇక బాబు ఈ విధంగా ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. అన్ని పధకాలను ఠంచనుగా జగన్ అందిస్తూ వచ్చినా జనాలు 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించలేదు. అందువల్ల పధకాలు ఒక్కటే గెలుపు మార్గం కాదని కూడా బాబుకు అర్ధం అయ్యే ఈ విధంగా కుండబద్ధలు కొట్టారని అంటున్నారు. మరి బాబు అనుకున్నదే నిజమైతే మాత్రం ఏపీలో ఉచితాల గోల అయితే తగ్గుతుంది. కానీ ఉచితాల రుచి మరిగిన వారు అలా ఆలోచిస్తారా అన్నదే ఇక్కడ పాయింట్.

Tags:    

Similar News