గాలిలో ఢీకొన్న విమానం - హెలీకాప్టర్... షాకింగ్ వీడియో!
Tragic Mid-Air Collision: American Airlines Flight and Military Helicopter Crash in D.C.
సాధారణంగా ఎదురెదురుగా వచ్చే బైక్స్, కార్స్ ఢీకొనడం చూస్తుంటామ్.. చాలా అరుదుగా ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢీకొన్నట్లు వింటుంటాం. కానీ... గాల్లో విమానం – హెలీకాప్టర్ పరస్పరం ఢీకొన్న ఘటన తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది. ఒకదానికొనటి ఢీకొన్న అనంతరం ఇవి రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
అవును... అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... సుమారు 64 మందితో వెళ్తున్న విమానం, మరో హెలీకాప్టర్ ఒకదానినొకటి ధీకొన్నాయి. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే... పీ.ఎస్.ఏ. ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి బయలుదేరి వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో రక్షణ శాఖకు చెందిన హెలీకాప్టర్ ను ఢీకొట్టింది. గాల్లో జరిగిన ఈ ప్రమాదంతో భారీ శబ్ధం వినిపించిందని చెబుతున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఇక, హెలీకాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మరోపక్క ఘటనా స్థాలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన వైఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. తన సంప్తాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి ప్రయణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. ఘటన గురించి రెసిడెంట్ ట్రంప్ తెలుసుకున్నారని.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ధృవీకరించారు.
ఈ ఘటనతో విమానాశ్రయంలో అన్ని టేకాఫ్ లు, ల్యాండింగ్ లు నిలిచిపోయాయని విమానాశ్రయం బుధవారం తెలిపింది. మరోపక్క.. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నట్లు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది.