పెళ్లి కోసం వెళితే వరుడికి దిమ్మ తిరిగింది.. పంచాయితీలో ఏం తేల్చారంటే?

మోసం అన్నదిప్పుడు కామన్ గా మారింది. నమ్మటమే సమస్యగా మారింది. అదేదో సినిమాలో అన్నట్టు నమ్మితేనే కదా మోసం చేయగలిగేది.

Update: 2025-01-30 07:30 GMT

మోసం అన్నదిప్పుడు కామన్ గా మారింది. నమ్మటమే సమస్యగా మారింది. అదేదో సినిమాలో అన్నట్టు నమ్మితేనే కదా మోసం చేయగలిగేది. ఇప్పుడు అలాంటి ధోరణి చాలాచోట్ల కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే.. అడ్డంగా బుక్ అయినట్లే. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి తెలిస్తే.. 'ఔరా' అని అనుకోకుండా ఉండలేరు. 34 ఏళ్లు వచ్చినా హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా జిల్లాకు చెందిన ఒక పెళ్లికాని ప్రసాద్ కు (అసలు పేరు ఇది కాదు) ఎట్టకేలకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది. వరుడి ఊరికి (నారీ గ్రామం) నుంచి కేవలం 20 కి.మీ. దూరంలో ఉండే ఊళ్లోనే (సింగా గ్రామం) సంబంధం కుదరటంతో తెగ సంతోషపడిపోయాడు.

మధ్యవర్తి చూపించిన సంబంధాన్ని వెంటనే ఫిక్సు చేసుకున్న వరుడు.. అమ్మాయి ఫోటోను చూసి.. ఒకసారి ఫోన్లో మాట్లాడి ఓకే చేసుకున్నారు. వెంటనే లగ్గాలు పెట్టేసుకున్నారు. ఆలస్యం చేయకుండా బంధుమిత్రుల్ని తీసుకొని ధూంధాంగా వధువు ఊరికి వెళ్లారు. భారీగా వచ్చిన వారికి.. ఆ గ్రామంలో ఎలాంటి పెళ్లి సందడి కనిపించకపోవటంతో షాక్ తిన్నారు. అసలు వషయాన్ని ఆరా తీయగా.. వారు అనుకున్నట్లుగా సదరు వధువు ఎవరూ ఊళ్లో లేరని చెప్పటంతో అవాక్కు అయ్యారు.

దీంతో స్థానిక పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ సంబంధాన్ని చూపించిన మధ్యవర్తి మనునూ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. రూ.50 వేలు తీసుకొని మరీ.. ఈ సంబంధాన్ని చూపించిన విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. ఈ అంశంపై ప్రైవేటు పంచాయితీ పెట్టుకున్న వరుడు తరఫు వారు.. విషయాన్ని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. వారంతా కలిసి పెళ్లి కోసం వరుడు ఖర్చు చేసిన రూ.5.86లక్షల మొత్తాన్ని మధ్యవర్తి మనూ భరించాలని తేల్చారు. మొత్తానికి ఈ పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి ముచ్చట జాతీయ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News